సాక్షి, సిటీబ్యూరో: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దాదాపు మూడేళ్ల క్రితం చిక్కిన హైక్వాలిటీ నకిలీ కరెన్సీ నోట్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మంగళవారం సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీని ద్వారా హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి అనేక కీలకాంశాలు తీసుకువెళ్లారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రుస్తుం, సద్దాం హోసేన్‌పై అభియోగాలు మోపిన ఎన్‌ఐఏ.. వీరి ఏజెంట్ల వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. ఈ నకిలీ నోట్ల సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంలో భాగమని పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు 2015లో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఈ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. రూ.5.01 లక్షల కరెన్సీతో వెళ్తున్న సద్దాం హోసేన్‌ను పట్టుకున్నారు. ఈ కేసు డీఆర్‌ఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు (ఎన్‌ఐఏ) వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న కీలక నిందితుడు రుస్తుంను రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్‌ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు గత ఏప్రిల్‌లో పట్టుకుంది.
రుస్తుం డీమానిటైజేషన్‌కు ముందు వరకు బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిపడిన నకిలీ కరెన్సీని చాలా కాలం వరకు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సహా అనేక జిల్లాలకు చెందిన ముఠాలు ఆయా ప్రాంతాల కేంద్రంగా రిసీవ్ చేసుకుని దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తుండే వాడు. ఆ సరిహద్దుపై నిఘా ముమ్మరం కావడం, సరిహద్దు భద్రతా దళం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో 2015 నుంచి అంతర్జాతీయ ముఠాలు తమ పంథాను మార్చాయి. బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దులు కలిగి ఉన్న మరో రాష్ట్రమైన అసోం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేయడంతోనే సద్దాం హోసేన్ వ్యవహారంపై ఉప్పంది 2015 సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో అరెస్టు చేశారు. అసోంలోని మణిక్‌పూర్‌కు చెందిన హోసేన్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతడికి అదే రాష్ట్రంలోని దుబ్రీ జిల్లాకు చెందిన రుస్తుంతో పరిచయమైంది.
ఒక్కోసారి ఒక్కో ఫోన్ నెంబర్ వినియోగించి హోసేన్‌తో సంప్రదింపులు జరిపిన రుస్తుం చివరకు తాను అందించే ఓ ప్యాకెట్‌ను బెంగళూరుకు చేరిస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానంటూ వల వేశాడు. డబ్బుకు ఆశపడిన హోసేన్ అందుకు అంగీకరిచడంతో న్యూ ఫరాఖా రైల్వేస్టేషన్‌లో అమ్రుల్ ద్వారా ఓ ప్యాకెట్ అందించాడు. అందులో నకిలీ కరెన్సీ ఉన్నాయని, గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్లాలని ఆదేశించాడు. అక్కడికి చేరుకున్నాక తనకు ఫోన్ చేస్తే, ఎక్కడ, ఎవరికి ఇవ్వాలనేది చెప్తానంటూ రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. రైలులో బెంగళూరు బయలుదేరిన హోసేన్ విశాఖపట్నంలో డీఆర్‌ఐ అధికారులకు చిక్కాడు.
ఇతడి నుంచి డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న 803 కరెన్సీ నోట్ల విలువ రూ.5.01 లక్షలుగా తేల్చారు. రుస్తుం అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఐ ఆధారాలు సేకరించింది. ఈ రాకెట్‌ను ఛేదించాలంటే రుస్తుంను పట్టుకోవడం అనివార్యం కావడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకిదింపింది. అయితే కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర హోంశాఖ దర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేసింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ యూనిట్ ముమ్మరంగా గాలింపు చేపట్టి గత ఏప్రిల్‌లో అతడిని పట్టుకున్నారు. వీరిద్దరి వెనుక భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తించడంతో వారిపై దృష్టిపెట్టారు. ఈ విషయాలను ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం దాఖలు చేసిన చార్జ్‌షీట్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment