పాక్‌లో మన కరెన్సీ ప్రింటింగ్‌! | Fake Indian Currency Printing in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో మన కరెన్సీ ప్రింటింగ్‌!

Published Thu, Mar 21 2019 3:12 AM | Last Updated on Thu, Mar 21 2019 4:47 AM

Fake Indian Currency Printing in Pakistan - Sakshi

భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపుతున్న పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ.. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్‌ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో దొరికిన కరెన్సీ అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్‌ మీదుగా పశ్చిమబెంగాల్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాక్‌లోని బలూచిస్తాన్‌ లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ‘భారత్‌ పవర్‌ ప్రెస్‌’ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ముద్రితమైన నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నా.. అసలు నోట్లపై ఉండే కొన్ని భద్రతా ప్రమాణాలను మాత్రం ఐఎస్‌ఐ కాపీ చేయలేకపోయింది.     
– సాక్షి, హైదరాబాద్‌ 

రూటు మార్చి భారత్‌కు.. 
క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్‌ఐ ప్రత్యేక పార్సిల్స్‌ ద్వారా పలు మార్గాల్లో భారత్‌కు వస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్‌ నుంచి విమానాల ద్వారా దుబాయ్‌/సౌదీ అరేబియాలకు తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జలమార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకుల పేరుతో వచ్చేవి. కొన్నాళ్లుగా ఈ మా ర్గం ద్వారా తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్‌ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణీ చేయిస్తోంది.

క్వాలిటీతో పాటే పెరిగిన కమీషన్‌ 
కరాచీ నుంచి మాల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్‌ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడి రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఇటీవల ఏజెంట్లకు ఇచ్చే ఈ కమీషన్‌ పెరిగింది. నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలో కమీషన్‌ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు, మాల్దాకు చెందిన బబ్లూ రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చే నిధులను పాకిస్తాన్‌ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలు ఉన్నాయి. 

చిక్కిన గౌస్‌.. పరారీలో బబ్లూ.. 
బండ్లగూడకు చెందిన మహ్మద్‌ గౌస్‌ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్‌ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌ నుంచి పలు మార్గాల్లో హైదరాబాద్‌కు తెప్పించి చెలామణీ చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్‌ ప్రాంతానికి చెందిన అమీనుల్‌ రెహ్మాన్‌ అలియాస్‌ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేశాడు. బబ్లూ గౌస్‌తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చారు. బబ్లూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

ఈ మూడు గమనించుకోవాలి.. 
1. సెక్యూరిటీ థ్రెడ్‌ 

కరెన్సీ నోటుకు ముందు వైపు మధ్యలో కుడివైపుగా నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. దీనికి కుడివైపున నోటు లోపలకు, బయటకు కనిపిస్తూ చిన్న పట్టీ ఉంటుంది. సిల్వర్‌ బ్రోమైడ్‌తో తయారయ్యే దీనిపై ఆర్బీఐ అంటూ ఆంగ్లం, హిందీ భాషల్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీపై ఆర్బీఐ మార్క్‌ ఉన్నా.. ఈ థ్రెడ్‌ సిల్వర్‌ కోటెడ్‌ అయి ఉండి, ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుంది.

2. బ్లీడ్‌ లైన్స్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  ముద్రించే రూ.2 వేల కరెన్సీ నోటుకు కుడి, ఎడమ వైపుల్లో పైభాగంలో కొన్ని గీతలు ఉంటాయి. బ్లీడ్‌ లైన్స్‌గా పిలిచే ఇవి కాస్త ఎత్తుగా, ఒక్కో వైపు ఏడు చొప్పున ఉంటాయి. సాధారణ నోటును చేతితో తడిమితే ఇవి తగులుతాయి. నకిలీ నోట్లలో ఈ ఫీచర్‌ను కాపీ చేయడం సాధ్యం కాదు. నకిలీ నోట్లపై కూడా లైన్లు ఉన్నా అవి చేతికి తగిలేలా పైకి ఉండవు. 

3. వాటర్‌ మార్క్‌

కరెన్సీ నోటుకు ముందు భాగంలో కుడి వైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది. పైకి కనిపించని విధంగా గాంధీ బొమ్మ ఉంటుంది. దీనికి పక్కగా ఆ నోటు విలువ వేసి ఉంటుంది. ఈ వాటర్‌ మార్కును వెలుతురులో పెట్టిచూస్తే అందులోనూ గాంధీజీ ఫొటో కనిపిస్తుంటుంది. దాదాపు సగం ప్రాంతానికి సరిపోతూ ఉంటుంది. నకిలీ నోట్లలోనూ ఈ వాటర్‌మార్క్‌లో గాంధీజీ ఫొటో ఉన్నా.. దాని చుట్టూ ఖాళీ ఎక్కువగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement