
తిరుపతిలో రూ.500 నకిలీ నోట్ల చెలామణి
తిరుపతి: తిరుపతి నగరంలో రూ. 500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. సోమవారం మహతి ఆడిటోరియం ఎదురుగా ఉన్న ఎంఆర్‌ఆర్ చికెన్ సెంటర్ యజమాని షేక్‌బాబ్జీకి వ్యాపారంలో రూ.500 నోటు వచ్చింది. చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్న చాన్‌బాషాకు నాలుగు రూ.500 నోట్లను ఇచ్చి కిరాణా షాప్‌కు పంపించాడు. కిరాణా షాపు యజమాని వాటిని తన వద్ద ఉన్న కౌంటింగ్ మిషన్‌లో పెట్టి పరిశీలించాడు. అందులో ఒక రూ.500 నోటు నకిలీదిగా గుర్తించాడు.
చాన్‌బాషా తెలిసిన వ్యక్తి కావడంతో నకిలీ నోటును తిరిగి పంపేశాడు. నోట్ల రద్దు తరువాత సరికొత్త టెక్నాలజీతో కొత్తనోట్లు ముద్రించిన రూ.500 కొత్తనోట్లకు బదులుగా నకిలీనోట్లు చెలామణి అవుతుండడంతో నగర వాసులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నకిలీ నోట్లు చెలామణి చేసేవారిపట్ల పోలీసులు నిఘా పెట్టి వాటిని అరికట్టాలని కోరుతున్నారు.