బీహార్లో దొంగనోట్లతో బాలుడి అరెస్టు
పిల్లలతో చేయించరాని పనులన్నీ చేయించేస్తున్నారు. నేరాల రాజధానిగా భావించే బీహార్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది. 14 ఏళ్ల పిల్లాడితో దొంగనోట్ల చెలామణి చేయిస్తున్నారు. అక్కడి తూర్పు చంపారన్ జిల్లాలో ఆ పిల్లాడు 1.06 లక్షల రూపాయల దొంగనోట్లతో పట్టుబడి అరెస్టయ్యాడు. దొంగనోట్ల చెలామణికి ఇలా పిల్లలను ఉపయోగించడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అతడిని గురువారం అరెస్టుచేశారు. ప్రస్తుతానికి చిన్న మొత్తంలోనే దొంగనోట్ల చెలామణికి పిల్లలను ఉపయోగించినా, భవిష్యత్తులో ఇది ఎంతవరకు వెళ్తుందోనన్న ఆందోళన కలుగుతోందని ఓ డీఆర్ఐ అధికారి తెలిపారు.
ఇంతకుముందు కూడా గత కొన్ని నెలలుగా తాను దొంగనోట్లు రవాణా చేసినట్లు ఆ పిల్లాడు విచారణలో అంగీకరించాడని మరో డీఆర్ఐ అధికారి తన పేరు బయట పెట్టొద్దంటూ చెప్పారు. భద్రత పటిష్ఠంగా ఉండటంతో అనుమానం రాకుండా ఉండేందుకు తనలా చాలామంది పిల్లలను ఈ గ్యాంగులు ఉపయోగిస్తున్నాయని అన్నారు. ఆ పిల్లాడు సిలిగురి నుంచి మోతిహారికి బస్సులో వెళ్తున్నాడని, అతడివద్ద వెయ్యి రూపాయల దొంగనోట్లు 90, అలాగే 500 రూపాయల దొంగనోట్లు 33 దొరికాయని చెప్పారు. వీటిని కోల్కతా నుంచి వెలువడే ఓ దినపత్రికలో చుట్టిపెట్టి ఉంచారు. 'దాదా' అనే వ్యక్తి తనకు ఈ నోట్లు ఇచ్చి, మోతీహారీలో ఇవ్వాలని చెప్పాడని, అక్కడ మరో వ్యక్తి వాటిని తీసుకుంటాడని బాలుడు తెలిపాడు.