దొంగనోట్ల చెలామణి పెరగడం పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ముంబై: దొంగనోట్ల చెలామణి పెరగడం పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రూ.500, రూ.1000 వంటి పెద్ద నోట్లను స్వీకరించేటపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం హెచ్చరించింది. సాధారణ లావాదేవీల్లో ఇలాంటి నోట్లను జాగ్రత్తగా పరిశీలించడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించింది.
అమాయక ప్రజలను మోసగించడానికి భారీగా దొంగనోట్లను చెలామణిలోకి తెస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందని వెల్లడించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే నకిలీ నోట్లను పసిగట్టవచ్చని తెలిపింది. పెద్ద సంఖ్యలో నోట్లను వినియోగించే సమయంలో మరిన్ని భద్రతా ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. నకిలీ నోట్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు, సంస్థల మద్దతు, సహకారం ఆశిస్తోంది.