నకిలీ కరెన్సీ అడ్డా.. ఏపీ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పోలీసు సహా వివిధ నిఘా విభాగాలు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో 17.91 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే దొరికినట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం రూ.3,03,54,604 విలువైన నకిలీ కరెన్సీ లభ్యమైంది. ఇందులో రూ.54,37,600 విలువైన కరెన్సీతో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచినట్లు గణాంకాలు వెల్లడించాయి.
రూ.87,47,820తో గుజరాత్ తొలిస్థానంలో, రూ.73,86,900తో ఛత్తీస్‌గఢ్ రెండో స్థానంలో ఉన్నాయి. స్వాధీనమవుతున్న నకిలీ కరెన్సీలో అత్యధిక భాగం పాకిస్థాన్ భూ భాగంలో ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నల్లో ముద్రతమవుతున్నట్లు హోం శాఖ అనుమానిస్తోంది. నిపుణులు సైతం గుర్తించలేని విధంగా ఈ కరెన్సీ ముద్రితమవుతుండటమే దీనికి నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నకలీ నోట్లలో రూ.1,000, రూ.500 నోట్లే అధికంగా ఉంటున్నాయి. దీంతో కరెన్సీ నోట్ల ముద్రణలో ఆర్‌బీఐ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. సెక్యూరిటీ ఫీచర్స్‌ను నానాటికీ పెంచుతోంది.
అయినప్పటికీ పాక్‌లో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ నోట్లు, అసలు నోట్ల మధ్య తేడాలు రానురాను తగ్గిపోతుండడం ఆందోళనకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవర్ ప్రెస్‌లోనే ఫేక్ కరెన్సీని ముద్రిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న రూ.3,03,54,604 విలువైన నకిలీ కరెన్సీలో రూ.1,98,95,000 విలువైనవి రూ.1,000 డినామినేషన్ నోట్లే కావడం గమనార్హం.