బయటపడ్డ రూ.28 కోట్ల నకిలీనోట్లు!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూ.28 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుట్టురట్టుచేశామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ లోక్సభకు వ్రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఆర్థికసంవత్సరం సెప్టెంబర్ వరకు రూ.6.37 కోట్ల రూ.5, రూ.10 నకిలీ నాణేలను తవ్వి తీశామని, అదేవిధంగా రూ.27.79 కోట్ల విలువైన 5.74 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించామని అరుణ్జైట్లీ పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గతేడాది బయటపడ్డ 8.86 లక్షల ఈ నకిలీ భారత కరెన్సీ నోట్ల విలువ రూ.43.83 కోట్లగా ఉందని. 2014లో ఈ విలువ రూ.40.58 కోట్లగా నమోదైందని చెప్పారు.
గూఢచర్యం, ఆయుధాలు, మందులు, ఇతర సామాగ్రి అక్రమ రవాణాల వల్ల ఈ నకిలీ కరెన్సీ విజృంభిస్తుందని జైట్లీ తన సమాధానంలో పేర్కొన్నారు. దీనికి ప్రధానకారణం సమాంతరం నల్ల ఆర్థికవ్యవస్థేనని ఆరోపించారు. 2010 జూలైలో ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం ఈ సమాంతర నల్ల ఆర్థికవ్యవస్థ, 2007 జీడీపీలో 23.2 శాతంగా ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థికవ్యవస్థను, ఈ సమాంతర నల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతీస్తుందని తెలిపారు. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేస్తుందని, చట్టబద్ధమైన ఆదాయాలను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుందని అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తంచేశారు.
తీవ్రవాదానికి నగదు సమకూరడాన్ని కట్టడి చేస్తూ.. బ్లాక్మనీని నిర్మూలించడానికి ప్రభుత్వం నవంబర్8న పెద్ద నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. కొత్త సెక్యురిటీ ఫీచర్లతో, కొత్త డిజైన్లో బ్యాంకు నోట్లను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా అన్ని రూ.500, రూ.2000 బ్యాంకు నోట్లు ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త డిజైన్లోనే ఉంటాయని చెప్పారు.