దొంగ నోట్లు హల్‌చల్ .. | in ATMs also fake notes are coming out | Sakshi
Sakshi News home page

దొంగ నోట్లు హల్‌చల్ ..

Published Sat, Jun 28 2014 3:19 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

దొంగ నోట్లు హల్‌చల్ .. - Sakshi

దొంగ నోట్లు హల్‌చల్ ..

 ఒంగోలు టౌన్ : జిల్లాలో దొంగ నోట్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఏటీఎంల్లో సైతం ఫేక్ నోట్లు వస్తుండటంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఒంగోలులో దొంగనోట్లు తయారు చేస్తున్న వ్యక్తి పోలీసులకు పట్టుబడటంతో అప్పటి నుంచి వ్యాపారుల్లో కలవరం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా రోజూ ఏదో ఒక చోట దొంగనోట్లను గుర్తిస్తున్నారు. ఒంగోలులో ఈ నెల 24వ తేదీన దొంగనోట్లు తయారు చేసే వ్యక్తిని టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 2.92 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం, అద్దంకి, దర్శి ప్రాంతాల్లోని వ్యాపారులు తమ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారడం.. వాటిలో నకిలీ నోట్లు ఏమైనా ఉన్నాయా.. అన్న అనుమానం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. కరెన్సీని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒంగోలులోని గాంధీరోడ్, ట్రంకురోడ్డు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, కర్నూల్ రోడ్డు ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచి రోజూ రూ.7 నుంచి 10 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి.
 
దొంగనోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని ఒంగోలులోనే పోలీసులు పట్టుకోవడంతో అతనికి ఉన్న సంబంధాలు, చేస్తున్న లావాదేవీలపై వ్యాపారులు, పోలీసులు దృష్టి సారించారు. ఒంగోలు కేంద్రంగా దొంగనోట్లు చెలామణి చేస్తున్న నిందితుడు పాలేటి కృష్ణబాబుకు ఒంగోలుతో పాటు చీరాల, అద్దంకి, మార్కాపురం, దర్శి, యర్రగొండపాలెం ప్రాంతాల్లోని కొందరితో విస్తృత సంబంధాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బ్యాంకు ఏటీఎంల్లోనూ అక్కడక్కడా దొంగనోట్లు వస్తుండటంతో ఖాతాదారులు ఎప్పుడు ఏ నోట్లు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలలో వచ్చే నకిలీ నోట్లు తీసుకుని బ్యాంకుకు వెళ్తే ఖాతాదారులకు అక్కడ సమాధానం చెప్పే వారు ఉండరు. బాగా తెలిసిన వ్యక్తులైతే ఏటీఎంల్లో వచ్చిన నకిలీ నోట్లను బ్యాంకు అధికారులు తీసుకుని వాటిని వెంటనే చింపేసి డస్ట్‌బిన్‌లో వేయడంతో నే సరిపెడుతున్నారు.
 
 ఏజెన్సీలపై అనుమానాలు

 ఏటీఎంల్లోకి నకిలీ నోట్లు ఏవిధంగా వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఏటీఎంల్లో నగదు నింపే ఏజెన్సీలపై ఖాతాదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ నోట్లపై విచారణ చేయకుండా బ్యాంకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థంకాని ప్రశ్న. చివరకు నష్టం జరిగేది ఖాతాదారులకే. రెండు నెలల క్రితం ఆర్టీసీ డిపోకు సమీపంలో ఉన్న రెండు ఏటీఎంల్లో నగదు నింపే ఏజెన్సీకి సంబంధించిన ఉద్యోగులు దాదాపు రూ. 40 లక్షలకు పైగా కాజేసిన విషయం తెలిసిందే.

ఆ కేసును పోలీసులు ఇప్పటికీ ఛేదించలేకపోవడం గమనార్హం. బ్యాంకుల నుంచి రోజూ లక్షలాది రూపాయలు తీసుకెళ్లి ఏటీఎంల్లో నింపుతున్న ఏజెన్సీల సిబ్బందికి నకిలీ నోట్ల రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఒంగోలులో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ఏటీఎంల్లో నగదు మాయం చేసిన వ్యక్తిని పోలీసులు ఇంతవరకూ అదుపులోకి తీసుకోలేకపోయారు. నిందితుడు రవి జిల్లా సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాల్లో జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. నగదు నింపడంలోనే బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించిన నిందితునికి దొంగనోట్ల ముఠాతో సంబంధాలు కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదని పలువురు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement