బాబోయ్... దొంగనోట్లు
పాలకొండ : దొంగనోట్లు... దొంగనోట్లు.. ప్రస్తుతం పాలకొండలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా దొంగనోట్లు దర్శనమిస్తున్నాయంటూ పలువురు చెబుతున్నారు. పోస్టాఫీసు, ఏటీఎంలలో కూడా దొంగనోట్లు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏజెన్సీ ముఖద్వారం కావడంతో కొంత మంది వ్యక్తులు దొంగనోట్లును మార్చేందుకు పాలకొండను కేంద్రంగా మార్చుకున్నారని తెలుస్తోంది. రోజూ కొంత మంది వ్యక్తులు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగేచోటుకు దొంగనోట్లును అందిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా రూ.1000, రూ.500 నోట్లు కట్టల్లో ఫేక్ నోట్లు అధికంగా ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.
సంత లే కేంద్రాలు
దొంగనోట్లు మార్చేవారు వారపుసంతలనే కేంద్రాలుగా ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పశువుల సంతల్లో రూ.లక్షల్లో మార్పిడి జరుగుతున్నట్టు పలువురు చెబుతున్నారు. ఇక్కడైతే అధికారుల పర్యవేక్షణ గాని, నోట్లు గుర్తించగలిగే సామర్థ్యం గానీ ఉండకపోవడం అవకాశంగా కనిపిస్తోంది. ఒకే సారి పెద్ద మొత్తంలో నగదు మార్చేందుకు వీలు కలుగుతుందని పలువురు అంటున్నారు. మరో వైపు గిరిజన గ్రామాలు అధికంగా ఉండటంతో వీరికి నోట్లుపై అవగాహణ ఉండదన్న విషయాన్ని తనకు అనుకూలంగా దొంగనోట్ల మార్పిడిదారులు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
గుర్తించడం కష్టమే
ప్రస్తుతం చలామణి అవుతోన్న దొంగనోట్లును గుర్తించడం కష్టతరంగా మారింది. అసలు నోట్లుకు వీటికి ఏ విధమైన తేడాలు కనిపించకపోవడం గమనార్హం. నగదు బ్యాంక్‌ల లో జమచేసే సమయాలలో మాత్రమే ఇవి వెలుగు చూస్తున్నాయి. రోజూ బ్యాంక్‌లలో దొంగనోట్లు పట్టుబడుతుండటం సర్వసాధారణంగా మారింది. అయితే బ్యాంకర్లు ఆ నోట్లును తీసుకుని అక్కడే చించి వేస్తున్నారు. ఇటీవల పోస్టాఫీసు నుంచి ఓ వ్యక్తి నగదు తెచ్చి బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళితే అక్కడ రూ.500 నోట్లు నకిలీవిగా బ్యాంక్ సిబ్బంది గుర్తించి చించి వేశారు. అయితే ఎలాంటి కేసులు ఎదుర్కొనాల్సి వస్తుందోనని బాధితులు విషయం చెప్పేందుకు ముందుకు రావడదం లేదు. ఇటీవల ఓ బ్యాంకు ఏటీఎంలో నగదు తీస్తే రూ.వెయ్యి కాగితం దొంగనోటు వచ్చిం దని ఒక వ్యక్తి తెలిపారు.
అయితే ఆ నోట్‌ను బ్యాంక్ సిబ్బందికే విడిచి పెట్టినట్టు చెప్పాడు.
అవగాహన కల్పిస్తున్నాం : స్టేట్‌బ్యాంక్ మేనేజర్ జగన్నాథ పండా దొంగనోట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించక తప్పదని స్థానిక ఎస్‌బీఐ మేనేజర్ జగన్నాథ పండా అన్నారు. అసలు నోట్లుకు, వీటికి పెద్దగా తేడా లేకపోవడంతో ప్రజలు మోసపోతున్నారన్నారు. బ్యాంక్‌కు వచ్చేవి దొంగనోట్లుగా తెలిస్తే ఫేక్ నోట్లు అని రాసి పెడుతున్నట్టు చెప్పారు. సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేస్తున్నామన్నారు. దొంగనోట్లను ఎలా గుర్తించాలి అనే అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పి స్తూ బ్యాంకులో బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పారు.