
నకిలీ నోట్లు చలా‘మనీ’
- యలమంచిలి కేంద్రంగా సాగుతున్న వ్యవహారం
- రూ.10వేల అసలుకు రూ.40వేలు నకిలీ నోట్లు
యలమంచిలి : యలమంచిలి కేంద్రంగా నకిలీనోట్లు జోరుగా చలామణి అవుతున్నాయి. రూ.500, రూ.1,000 నోట్లను చూస్తేనే ఇక్కడ వ్యాపారులు, ప్రజలు హడలిపోతున్నారు. అంతా ఈ నోట్లను ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటున్నారు. ఇందుకు పరికరాలను కొందరు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి గుట్టుగా ఈ వ్యవహారం సాగిస్తున్నారన్న వాదన ఉంది.
రూ.10వేలు అసలనోట్లకు రూ.40వేలు నకిలీ కరెన్సీ ఇస్తుండటంతో నేరం అని తెలిసినప్పటికీ ఇందుకు కొందరు యువకులు ఆసక్తి చూపుతున్నారు. యలమంచిలిలో ఏ దుకాణం వద్దకైనా వెళ్లి సరుకులు కొనుగోలు చేసినా రూ.100 నోటు ఉంటే ఇమ్మని అడుగుతున్నారు. వారపు సంతలు, నగల దుకాణాలు, ప్రైవేట్ చిట్టీ వ్యాపారులు, ఫైనాన్సియర్లు, పెట్రోల్‌బంకుల్లో దొంగనోట్లను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్‌లో టిక్కెట్ బుకింగ్ కార్యాలయం, బ్యాంకులకు నకిలీనోట్లు తరచూ వస్తున్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
మునిసిపాలిటీలోని భవనం వీథిలో ఇటీవల ఒక నగల దుకాణంలో మహిళ దుకాణదారుడికి ఇచ్చిన సొమ్ములో రూ.500 నకిలీ నోటు బయటపడింది. బస్ కాంప్లెక్స్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక ఫైనాన్స్ వ్యాపారికి వచ్చిన రోజువారి కలెక్షన్‌లో రూ.1,000, రూ.500 నకిలీ నోట్లు గుర్తించారు. నకిలీ నోట్ల బెడదతో పాత ఆంధ్రాబ్యాంక్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ఒక మీ-సేవా కేంద్రంలో రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదంటూ ఏకంగా నోటీసు బోర్డు పెట్టడం ఇందుకు తార్కాణం.
ఒక ప్రైవేట్ కళాశాల్లో విద్యార్థులు చెల్లించిన ఫీజు సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తే అందులో రూ.500 నోట్లు రెండు నకిలీవిగా సిబ్బంది గుర్తించి జమ చేయడానికి వెళ్లిన కళాశాల ఉద్యోగిని మందలించారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో బయటపడిన నకిలీ నోట్లపై రైల్వేశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఇటీవల రెండు కేసులు నమోదు చేశారు. బ్యాంకులకు వచ్చినవాటిపై అధికారులు ‘ఫేక్‌రూ. నోట్ అని రాసి ఊరుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఇదే చలామణిదారులకు అవకాశంగా మారుతోంది.