దొంగనోటును చూపుతున్న కన్నమ్మ (ఇన్‌సెట్‌లో) దొంగనోటు
తిరుపతి రూరల్: ఈమె పేరు కన్నమ్మ... వయస్సు 78 ఏళ్లు...ఊరు పాకాల మండలం దామలచెరువు. ప్రతిరోజూ అక్కడి నుంచి మామిడి కాయల తట్టతో తిరుపతికి వస్తుంది. ఎర్రటి ఎండలో ఫుట్‌పాత్‌పైన పెట్టుకుని వాటిని విక్రయిస్తుంది. రెండు రోజులుగా ఇలాగే కష్టపడి తిరుపతికి వచ్చి వ్యాపారం చేస్తోంది. మంగళవారం ఉదయం 7.50 గంటలకు తిరుపతి అన్నమయ్య సర్కిల్‌కు మామిడికాయల తట్టతో చేరుకున్న ఆమె ఫుట్‌పాత్‌పై కాయల విక్రయానికి సిద్ధమైంది. అంతలోనే ఓ నడివయస్కుడు బైక్‌పై వచ్చాడు. మూడు కేజీల కాయలు కావాలని అడిగాడు. కేజీ రూ.30 చొప్పున మూడు కేజీలకు రూ.90 అని చెప్పింది. ఇప్పుడే వచ్చాను...కాయలు వేయడానికి కవర్లు కూడా లేవు. ఉండు ఇప్పడే వస్తాను అంటూ లేని ఓపికను తెచ్చుకుని లేవబోయింది.
ఇంతలో అతను రూ.500 కాగితం తీసి ఇచ్చాడు. రూ.500 కాగితం చూడగానే ఆ వృద్ధురాలు తబ్బిఉబ్బిపోయింది. నాయనా....నీదే తొలిబేరం....ఆరోగ్యం సరిగా లేదు.... కాయలు అమ్ముడు పోయి త్వరగా ఇంటి వెళ్లాలి...అసలే కళ్లు తిరుగుతున్నాయి.... అంటూ సంతోషంతో రూ.500 నోటు చేతికి తీసుకుంది. చేతితో తాకగానే ఏదో... తేడా కొట్టడంతో, అయ్యా.... ఈ నోటు... అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఏంది అవ్వ....అనుమానమా? అదిగో ఆ షాపు ఆమే ఇచ్చింది...ఏదైనా ఇబ్బంది అంటే వాళ్లకే ఇచ్చేయ్...అంటూ దబాయించాడు. ఎక్కడ తొలిబేరం పోతుందో...అనే ఆత్రుతలో ఆ నోటును తీసుకుని..రూ.410, మూడు కిలోల మామిడికాయల కవర్‌ను ఇచ్చింది. మరో బేరం రావడంతో చిల్లర కోసం వెళ్లిన ఆమెకు అది దొంగనోటు అని చెప్పడంతో అవాక్కయింది. తాను మోసపోయిన విషయం తెలిసి గుండెలు బాదుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. ఏడ్చి..ఏడ్చి స్పృహతప్పిపోయింది. ఆమె దీనవస్థను చూసి, చలించిన చుట్టుపక్కల వాళ్లు ఆమెకు సహాయం చేయాలని ప్రయత్నించారు. ఆత్మాభిమానం కలిగిన ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించింది.
సీసీ కెమెరాల్లో నిందితుడు...
దొంగనోటు ఇచ్చి వృద్ధురాలిని ఏమార్చిన వ్యక్తిని పట్టుకోవాలని స్థానికులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లోని కమెండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడిని గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దొంగనోట్లు అతని వద్దకు ఎలా వచ్చాయి? అతనేనా, అతనితో పాటు ముఠా ఉందా? అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment