five hundred notes
-
రూ.500 నోట్ల హవా..!
భద్రాద్రి: అసెంబ్లీ ఎన్నికల పూణ్యమా అని ప్రస్తుతం మార్కెట్లో రూ.500 నోటు హవా కొనసాగుతోంది. ఎవరి చేతిలో చూసినా ఈ నోటే సందడి చేస్తోంది. రెండు, మూడు రోజులుగా సాధారణ వ్యక్తులతో పాటు అన్ని వర్గాల ప్రజల వరకు రూ.500 నోట్లు జోరుగా చేతులు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇటీవల జోరుగా నగదు పంపిణీకి తెర లేపినట్లు తెలిసింది. ఓటర్లకు పంచడానికి ఈ పెద్ద నోట్లనే పెద్ద సంఖ్యలో వాడినట్లు కూడా సమాచారం. ఓటుకు నోటు పంపిణీలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు రూ.500 నోట్లను అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండా పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేసినట్లు అన్ని చోట్లా ఆరోపణలు వినిపించాయి. ఈసారి ఎన్నికల్లో అన్ని చోట్లా రూ.500 నోట్ల కట్టలు పెద్దఎత్తున చేతులు మారినట్లు తెలిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటుకు రూ.1,000 నుంచి 2,000 చొప్పున పంపిణీ చేసినట్లు పలువురు చెబుతున్నారు. అక్కడక్కడా పోటీ తీవ్రతను బట్టి ఓటర్లకు కొంత అదనంగా కూడా ముట్టజెప్పినట్లు కూడా వినిపించింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ తంతు గత నెల 27 నుంచి 30 వరకు రాత్రింబవళ్లు కొనసాగగా.. ఈ పంపిణీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.500 నోట్లనే పెద్ద మొత్తంలో సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం. ప్రతి గ్రామ పరిధిలో 70 శాతం చొప్పున ఈ పెద్దనోటు చేరింది. ఒకే ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే ఇక వారి పంట పండింది. కనీసం నాలుగు ఓట్లు ఉన్నవారికి దాదాపు 10 వేలకు పైగా చేతికందినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బును పంచారనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలో దాదాపు రూ.300 కోట్ల వరకు ఓటర్లకు పంపిణీ జరిగినట్లు అంచనా. అధికార పార్టీ అభ్యర్థులు ఓటుకు రూ.1,500 నుంచి రూ.2,000 వేల చొప్పున నగదును పంపిణీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రూ.1,000 చొప్పున 70 శాతం ఓటర్లకు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క అభ్యర్థికి నియోజకవర్గ పరిధిలో రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు పంచడానికి ఖర్చయినట్లు సమాచారం. డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి చేతికి నగదు చేరింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో దండిగా కరెన్సీ ఉంది. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటే రూ.500 నోట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరగాయలతో పాటు చిన్నాచితకా అవసరాలకు సైతం ఈ పెద్దనోటునే తీస్తున్నారు. అన్ని అవసరాలకు ఈ రూ.500 నోటే అధారంగా నిలుస్తోంది. రెండు రోజులుగా డిజిటల్ లావాదేవీలు సైతం తగ్గిపోయాయని బ్యాంకు అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ అవసరాల నిమిత్తం చేతి నుంచే నగదు అందజేస్తున్నారని ఇందుకోసం ఎన్నికల వేళ ఇచ్చిన రూ.500 నోట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్కెట్లో రూ.500 నోట్ల తాకిడితో రూ.100, రూ.200 నోట్ల చెలామణి అంతగా కనిపించడం లేదు. అంతటా పెద్దనోట్లు వాడటంతో అటు చిల్లర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటు ఫోన్–పే, గూగూల్–పే వినియోగం సగానికి తగ్గిపోగా, అటు ప్రధాన బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో వినియోగదారుల సందడి కనిపించడం లేదు. అందరికీ చేతినిండా నగదు ఉండటంతో అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో పలు ఏటీఎం సెంటర్లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోయి కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పెద్దనోట్ల చలామణి పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటుండగా, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు సైతం కండక్టర్లకు రూ.500 నోటునే ఇవ్వటంతో చిల్లర లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు అంతగా కనిపించని రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అందరూ పెద్ద నోట్లే ఇస్తున్నారు.. తాజాగా ఓటుకు నోటు పంపకాల్లో ప్రతి ఒక్కరికీ ఈ పెద్దనోట్లనే అందించినట్లున్నారు. దీంతో అందరి దగ్గర రూ.500 నోట్లే ఉంటున్నాయి. రెండురోజులుగా షాపునకు వచ్చే కస్టమర్లు చిన్న అవసరానికి కూడా ఈ నోటునే తీస్తున్నారు. మొన్నటివరకు చిన్న నగదుకు సైతం ఫోన్–పే, గూగుల్–పే వంటివి చేసేవారు. ఇప్పుడు అవి సగానికి సగం తగ్గిపోయాయి. అందరూ డబ్బులే ఇస్తున్నారు. – బల్దేవ్, చిరు వ్యాపారి -
ఇండియన్ కరెన్సీని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా!
డబ్బు.. గల్లీ నుంచి ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరితో దీనితో అమితమైన సంబంధం ఉంటుంది. ఎన్ని చేతులు మారిన విలువ మారనిది డబ్బు ఒకటే. సంపాదిస్తే కానీ డబ్బు విలువ తెలీసిరాదంటారు. చాలామంది డబ్బు ద్వారానే విలువస్తుందని భావిస్తుంటారు. ఏ పని చేసినా దాని కోసమే. మనిషి జీవితాన్ని శాసించేది కూడా డబ్బే. డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం. చూడటానికి కాగితం ముక్కే కావచ్చు కానీ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.మరి అలాంటి డబ్బులను ప్రింట్ చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. ఒక సాధారణ కాగితానికి 10,100.. నుంచి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది. భారతీయ కరన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ► 2018 నాటి డేటా ప్రకారం.. 10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►20 రూపాయల నోటును ముంద్రించడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అంటే దీనికి 10 రూపాయల నోటు కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ► 50 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►100 రూపాయల నోటును ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది. ►200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. ►500 రూపాయల నోటును ముద్రించడానికి 2.57 పైసలు ఖర్చవుతుంది. ►2000 రపాయల నోటును ముద్రించడానికి 4.18 పైసలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్ల ఖర్చు కూడా చూసుకుంటే.. ►పాత 500 రూపాయల నోటును ముద్రించడానికి 3.09 పైసలు ఖర్చు అవుతుంది. అంటే కొత్త 500 రూపాయల కంటే 52పైసలు అధికం. ►పాత 1000 రూపాయల నోటును ముంద్రించడానికి 3.54 పైసలు ఖర్చు అవుతుంది. అంతే కొత్త 2000 రూపాయల కంటే 64 పైసలు తక్కువ. -
వృద్ధురాలిని ఏమార్చి...దొంగనోటును అంటకట్టి..!!
తిరుపతి రూరల్: ఈమె పేరు కన్నమ్మ... వయస్సు 78 ఏళ్లు...ఊరు పాకాల మండలం దామలచెరువు. ప్రతిరోజూ అక్కడి నుంచి మామిడి కాయల తట్టతో తిరుపతికి వస్తుంది. ఎర్రటి ఎండలో ఫుట్‌పాత్‌పైన పెట్టుకుని వాటిని విక్రయిస్తుంది. రెండు రోజులుగా ఇలాగే కష్టపడి తిరుపతికి వచ్చి వ్యాపారం చేస్తోంది. మంగళవారం ఉదయం 7.50 గంటలకు తిరుపతి అన్నమయ్య సర్కిల్‌కు మామిడికాయల తట్టతో చేరుకున్న ఆమె ఫుట్‌పాత్‌పై కాయల విక్రయానికి సిద్ధమైంది. అంతలోనే ఓ నడివయస్కుడు బైక్‌పై వచ్చాడు. మూడు కేజీల కాయలు కావాలని అడిగాడు. కేజీ రూ.30 చొప్పున మూడు కేజీలకు రూ.90 అని చెప్పింది. ఇప్పుడే వచ్చాను...కాయలు వేయడానికి కవర్లు కూడా లేవు. ఉండు ఇప్పడే వస్తాను అంటూ లేని ఓపికను తెచ్చుకుని లేవబోయింది. ఇంతలో అతను రూ.500 కాగితం తీసి ఇచ్చాడు. రూ.500 కాగితం చూడగానే ఆ వృద్ధురాలు తబ్బిఉబ్బిపోయింది. నాయనా....నీదే తొలిబేరం....ఆరోగ్యం సరిగా లేదు.... కాయలు అమ్ముడు పోయి త్వరగా ఇంటి వెళ్లాలి...అసలే కళ్లు తిరుగుతున్నాయి.... అంటూ సంతోషంతో రూ.500 నోటు చేతికి తీసుకుంది. చేతితో తాకగానే ఏదో... తేడా కొట్టడంతో, అయ్యా.... ఈ నోటు... అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఏంది అవ్వ....అనుమానమా? అదిగో ఆ షాపు ఆమే ఇచ్చింది...ఏదైనా ఇబ్బంది అంటే వాళ్లకే ఇచ్చేయ్...అంటూ దబాయించాడు. ఎక్కడ తొలిబేరం పోతుందో...అనే ఆత్రుతలో ఆ నోటును తీసుకుని..రూ.410, మూడు కిలోల మామిడికాయల కవర్‌ను ఇచ్చింది. మరో బేరం రావడంతో చిల్లర కోసం వెళ్లిన ఆమెకు అది దొంగనోటు అని చెప్పడంతో అవాక్కయింది. తాను మోసపోయిన విషయం తెలిసి గుండెలు బాదుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. ఏడ్చి..ఏడ్చి స్పృహతప్పిపోయింది. ఆమె దీనవస్థను చూసి, చలించిన చుట్టుపక్కల వాళ్లు ఆమెకు సహాయం చేయాలని ప్రయత్నించారు. ఆత్మాభిమానం కలిగిన ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించింది. సీసీ కెమెరాల్లో నిందితుడు... దొంగనోటు ఇచ్చి వృద్ధురాలిని ఏమార్చిన వ్యక్తిని పట్టుకోవాలని స్థానికులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లోని కమెండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడిని గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దొంగనోట్లు అతని వద్దకు ఎలా వచ్చాయి? అతనేనా, అతనితో పాటు ముఠా ఉందా? అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. -
నోట్ల కట్టల అల్లకల్లోలం
రూపాయలు 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మిక సంచలన ప్రకటన అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన మరుక్షణం మార్కెట్ లో అలజడి ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు తమ జేబుల్లో ఉన్న 500, 1000 నోట్లను చూసుకుని వాటిని మార్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ నోట్లను అంగీకరించిన చోట్ల కొందరు కొనుగోళ్లు జరిపారు. అయితే అత్యవసర పనుల కోసం కొందరు ఆ నోట్లను వినియోగించాలనుకున్నప్పటికీ వ్యాపారస్తులు అంగీకరించపోవడంతో పలు చోట్ల సాధారణ పౌరులు ఇబ్బందులు పడ్డారు. పాత నోట్లు అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అవుతుందని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ చాలా చోట్ల చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దస్థాయి వ్యాపారస్తులు వాటిని అంగీకరించడం లేదు. ఈ తాజా నిర్ణయం 500, 1000 నోట్ల కట్టలున్న వారిని తీవ్ర ఆందోళనలో పడిపోయారు. భారీ స్థాయిలో ఆ నోట్ల కట్టలున్న వారు ఇరకాటంలో పడిపోయారు. వాటిని తెల్లధనంగా మార్చుకోవడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు ఈ ప్రకటన అనంతరం సాధారణ పౌరులు ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. తమ వద్ద ఉన్న కొన్ని నోట్లను ఈ కామర్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పెద్ద ఎత్తున క్యాష్ డిపాజిట్ మిషీన్స్ (సీడీఎం) ల వద్ద బారులు తీరడం కనిపించింది. ఇకపోతే వచ్చే రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయబోవని తెలిసిన తర్వాత రెండు రోజుల పాటు కనీస అవసరాలు, అత్యవసర పనుల నిర్వహణ కోసం చాలా మంది ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. అందులోనూ చాలా మంది 500 లోపు డబ్బు డ్రా చేయడానికి ఒకటికి నాలుగుసార్లు ఏటీఎంలను వినియోగించారు. కొన్ని చోట్ల చిన్నస్థాయి వ్యాపారస్తులు సైతం ఆ ప్రకటన వెలువడినప్పటి నుంచే 500, 1000 రూపాయల నోట్లను అంగీకరించకపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ నిర్ణయం, అనధికారికంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మార్చే బడా బడా నేతలు, వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆ నిధులను మార్చుకోవడం ఎలా అన్నది అంతుబట్టక అయోమయంలో పడిపోయారు. కొందరు వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా అంగీచడం లేదని వినియోగదారులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇంకో విషయమేంటంటే... మీ వద్ద ఐడెంటిటీ కార్డు ఉంటే బ్యాంకుల వద్ద రేపటి నుంచి మీరు కమిషన్ ఏజెంట్లుగా అవతరించవచ్చంటూ పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేశారు.