నోట్ల కట్టల అల్లకల్లోలం
నోట్ల కట్టల అల్లకల్లోలం
Published Tue, Nov 8 2016 10:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
రూపాయలు 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మిక సంచలన ప్రకటన అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన మరుక్షణం మార్కెట్ లో అలజడి ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు తమ జేబుల్లో ఉన్న 500, 1000 నోట్లను చూసుకుని వాటిని మార్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ నోట్లను అంగీకరించిన చోట్ల కొందరు కొనుగోళ్లు జరిపారు. అయితే అత్యవసర పనుల కోసం కొందరు ఆ నోట్లను వినియోగించాలనుకున్నప్పటికీ వ్యాపారస్తులు అంగీకరించపోవడంతో పలు చోట్ల సాధారణ పౌరులు ఇబ్బందులు పడ్డారు. పాత నోట్లు అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అవుతుందని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ చాలా చోట్ల చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దస్థాయి వ్యాపారస్తులు వాటిని అంగీకరించడం లేదు.
ఈ తాజా నిర్ణయం 500, 1000 నోట్ల కట్టలున్న వారిని తీవ్ర ఆందోళనలో పడిపోయారు. భారీ స్థాయిలో ఆ నోట్ల కట్టలున్న వారు ఇరకాటంలో పడిపోయారు. వాటిని తెల్లధనంగా మార్చుకోవడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు ఈ ప్రకటన అనంతరం సాధారణ పౌరులు ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. తమ వద్ద ఉన్న కొన్ని నోట్లను ఈ కామర్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పెద్ద ఎత్తున క్యాష్ డిపాజిట్ మిషీన్స్ (సీడీఎం) ల వద్ద బారులు తీరడం కనిపించింది.
ఇకపోతే వచ్చే రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయబోవని తెలిసిన తర్వాత రెండు రోజుల పాటు కనీస అవసరాలు, అత్యవసర పనుల నిర్వహణ కోసం చాలా మంది ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. అందులోనూ చాలా మంది 500 లోపు డబ్బు డ్రా చేయడానికి ఒకటికి నాలుగుసార్లు ఏటీఎంలను వినియోగించారు. కొన్ని చోట్ల చిన్నస్థాయి వ్యాపారస్తులు సైతం ఆ ప్రకటన వెలువడినప్పటి నుంచే 500, 1000 రూపాయల నోట్లను అంగీకరించకపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు పడ్డారు.
అయితే ఈ నిర్ణయం, అనధికారికంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మార్చే బడా బడా నేతలు, వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆ నిధులను మార్చుకోవడం ఎలా అన్నది అంతుబట్టక అయోమయంలో పడిపోయారు. కొందరు వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా అంగీచడం లేదని వినియోగదారులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇంకో విషయమేంటంటే... మీ వద్ద ఐడెంటిటీ కార్డు ఉంటే బ్యాంకుల వద్ద రేపటి నుంచి మీరు కమిషన్ ఏజెంట్లుగా అవతరించవచ్చంటూ పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేశారు.
Advertisement
Advertisement