గుజరాత్‌లో నకిలీ నోట్ల భాగోతం
సాక్షి, అహ్మదాబాద్: దేశంలో జ(పె)రుగుతున్న అవినీతి, నల్లధనాన్ని నిరోధించడానికి ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దును(రూ.500, 1000) చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రకటించారు. అదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ పాలిట శాపంలా తయారైన నకిలీనోట్ల దందాకు చెక్ పెట్టొవచ్చు అని భావించారు. అయితే ఇది ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. ప్రధాని స్వరాష్ట్రంలోనే నకిలీ నోట్లను భారీ మొత్తంలో పట్టుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.
కేంద్ర హోం శాఖ తాజా నివేదికల ప్రకారం గుజరాత్‌లో ఇప్పటి వరకూ చలామణిలో ఉన్న నకిలీ రూ.2000 నోట్లలో సుమారు 40శాతం నోట్లను సీజ్ చేసినట్లు ప్రకటించింది. 2016 నవంబర్ 9 నుంచి 2017 మార్చి 7 వరకు ఒక్క గుజారాత్‌లోనే సుమారు రూ.26 లక్షల 42 వేలు విలువైన రూ. 2000 నోట్లను పట్టకున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం మీద సుమారు రూ.67లక్షల విలువ చేసే నకిలీ నోట్లను పట్టుకున్నారు. గుజరాత్ నుంచి దేశ వ్యాప్తంగా నకిలీ నోట్ల సరఫరా చేస్తున్న 12మందిని అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా 64 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటించింది.
దేశంలో చలామణి అవుతున్న నకిలీ నోట్లు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాళ్ నుంచి వస్తున్నట్లు గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లోనకిలీ నోట్లు చలామణి అధికంగా ఉందన్నారు.