
వేలల్లో ఒక ‘స్టార్’
మనం వినియోగిస్తున్న కరెన్సీ నోట్ల నంబర్ల మధ్యలో స్టార్ గుర్తులు అప్పడప్పుడూ కనిపిస్తాయి. స్టార్ ఉన్న నోట్లు నకిలీవని కొందరు ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఆ స్టార్ గుర్తు ఉన్న నోట్లు మంచివే. ఇవి ప్రత్యేకమైనవి. వేల నోట్లలో ఒకటి మాత్రమే ఇటువంటివి ఉంటాయి. కరెన్సీ నోట్లు ముద్రించే విషయంలో రిజర్వు బ్యాంక్ సిబ్బంది అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్లు కేటాయించే సమయంలో ముందుగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో మూడు నంబర్లు ముద్రిస్తారు. వాటి నుంచి కొంత ఖాళీ ఉంచి తర్వాత ఆరు నంబర్లు ముద్రిస్తారు. సీరియల్ నంబర్ల ఆధారంగా వంద నోట్లను ఒక కట్టగా కడతారు. అయితే ముద్రణా లోపం వల్ల కొన్ని నోట్లు పాడైపోతాయి.
అటువంటి నోట్ల స్థానంలో స్టార్ గుర్తు పెట్టి కొత్తనోటును ముద్రించి ఆ కట్టలో పెడుతారు. అటువంటి నోట్ ఉన్న కట్టపై ప్రత్యేకంగా స్టార్ గుర్తును కూడా ముద్రిస్తారు. తద్వారా ఆ కట్టలో స్టార్ గుర్తు ఉన్న నోటు ఉందని తెలుసుకోవచ్చు. అటువంటి నోట్లు వేలల్లో ఒకటి ఉంటాయి. అలా వచ్చిన అరుదైన రూపాయి, రూ.10, రూ.20, రూ.50 నోట్లను లక్కవరపుకోట స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఏఎస్‌ఎన్ రాజు సేకరించారు. తాను 15ఏళ్లుగా ఇటువంటి నోట్లు సేకరిస్తున్నానని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ప్రారంభిస్తే ఇప్పటికి రూపాయి, రూ.10, రూ.20, రూ.50 నోట్లు లభించాయని తెలి పారు.
- లక్కవరపుకోట