సాక్షి, మండ్య (బెంగళూరు): కొన్నాళ్లుగా నిలిచిపోయిన హనీట్రాప్ దందా మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. మండ్యలో ఒక నగల వ్యాపారిపై వలపు వల విసిరి భారీగా కొల్లగొట్టిన వైనం వెలుగుచూసింది. మండ్య మహావీర్ సర్కిల్‌లో ఉన్న శ్రీనిధి నగల షాపు యజమాని ఎస్.జగన్నాథ్ శెట్టి హనీ ట్రాప్‌కు గురై రూ. 48 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బస్టాండులో ఉండగా కారులో పికప్
వివరాలు... ఈ ఏడాది ఫిబ్రవరి నెల 22వ తేదీ రాత్రి సుమారు 8 గంటలకు పని మీద మంగళూరుకు వెళ్లాలని మండ్య బస్టాండుకు వచ్చాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది, అందులోనివారు మీరు ఎక్కడ వెళుతున్నారు అని అడిగారు. మేము మైసూరు వరకు డ్రాప్ చేస్తామని ఆయనను ఎక్కించుకున్నారు. మా వద్ద కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయి, వాటి విలువ చెప్పాలని ఆయన వద్దు వద్దంటున్నా మైసూరులోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అందులో నిందితులు సల్మా బాను, జయంత్ ఉన్నారు, మరో యువతి కూడా గదిలోకి వచ్చింది.
కెమెరాతో అంతా వీడియో తీసి, మా చెల్లెళ్లతో నీకేం పని అని జయంత్ ఆ వ్యాపారిని బెదిరించాడు. అతన్ని కొట్టి రూ. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. దీంతో దిక్కుతోచని బాధితుడు ఒక ఎల్‌ఐసి ఉద్యోగి నుంచి, మరో జువెలరీ షాప్ యజమాని నుంచి మొత్తం రూ.48 లక్షలు వారికి ఇప్పించాడు. అయితే మరింత డబ్బు తేవాలని దుండగులు పీడిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment