శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేయాల్సిన సుమారు 70 లక్షలు స్వాహా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏటీఎంలో డబ్బు పెట్టే ఏజెన్సీ ఉద్యోగితో పాటు ఒక స్వర్ణవ్యాపారి కుమారుడు కూడా ఉన్నాడని తెలిసింది. డబ్బు తిరిగి చెల్లిస్తామని బ్యాంకు అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయటకు తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పూర్తి వివరాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం మున్సిపాల్టీలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగి పని చేసిన వ్యక్తి కుమారుడు, పట్టణంలో జీటీ రోడ్డులో బంగారు దుకాణం వ్యాపారి కుమారుడు స్నేహితులు. శ్రీకాకుళం పట్టణంలోని ఒక బ్యాంకుతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో సొమ్ములు జమ చేసే సెక్యూరిటీ ఏజెన్సీలో కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు కొంతకాలంగా పని చేస్తున్నాడు. ఏటీఎంలో డబ్బులు జమ చేసే విధి నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితుడైన స్వర్ణవ్యాపారుడి కుమారుడు క్రికెట్ బెట్టింగ్‌లో చాలావరకు నష్టపోయాడు. అధిక మొత్తంలో అప్పులు చేయడంతో, వాటికోసం అప్పుల వాళ్లు బెదిరిస్తున్నారు. దీంతో ఏటీఎం ఏజెన్సీలో పని చేస్తున్న మిత్రుడికి బెట్టింగ్‌పై ఆశకలిగించాడు. తనకు సీసీఎల్ మ్యాచ్‌ల్లో క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి అధిక మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. తనకు డబ్బు ఇస్తే బెట్టింగ్ కడతానని, గెలిస్తే అందులో వాటా ఇస్తానని లేకపోతే తీసుకున్న సొమ్ముకు పది శాతం వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు ఏటీఎంలో జమచేయాల్సిన డబ్బులో సుమారు రూ.70 లక్షలు మూడు విడతలుగా మిత్రుడికి ఇచ్చాడు. నెల రోజుల్లో ఈ సొమ్ముకు లెక్క చెప్పకపోతే బ్యాంకు అధికారులు గుర్తిస్తారని తెలిసినా బెట్టింగ్‌పై ఆశతో ఇందుకు పూనుకున్నాడు.
బెట్టింగ్‌లో డబ్బులు రాకపోగా అసలు విషయం అధికారులకు తెలిసింది. బ్యాంకులో జమకావాల్సిన సొమ్ములో కొంత మొత్తం తగ్గడం గమనించి ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన సెక్యూరిటీ ఏజెన్సీ వారు తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగే ఈ పనిచేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధం కాగా, స్వర్ణవ్యాపారి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు వారితో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, ఆ మొత్తం తాము చెల్లిస్తామని చెప్పడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో నిందితుల పేర్లు బయటకు రాలేదు.
బ్యాంకు సిబ్బంది సాయంపై అనుమానాలు
ఏజెన్సీ సొమ్ము జమచేస్తున్న పలు బ్యాంకుల్లో ఒక బ్యాంకు సిబ్బందికి ఈ విషయం ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే అంత మొత్తంలో సొమ్మును సెక్యూర్టీ ఏజెన్సీకి తెలియకుండా తీసినట్టు తెలుస్తొంది. ఎప్పటికప్పుడు లావాదేవీలు చూడాల్సిన కొంతమంది సిబ్బంది కొంత మొత్తానికి ఆశపడి సహకారం అందించారని సమాచారం. దీనిపై ఇప్పటికైనా పోలీసులకు ఫిర్యాదు అందుతుందా అన్నది వేచి చూడాలి.
ఏటీఎం సొమ్ము రూ.70 లక్షలు స్వాహా
Published Fri, Oct 4 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement