సింహాచలం భూముల గోల్‌మాల్‌.. పన్నాగం ‘పెద్ద’లదే! | TDP leaders irregularities come to light in Simhachalam land Scam | Sakshi
Sakshi News home page

Simhadri Appanna Temple: పన్నాగం ‘పెద్ద’లదే!

Published Mon, Jun 28 2021 3:35 AM | Last Updated on Mon, Jun 28 2021 8:11 AM

TDP leaders irregularities come to light in Simhachalam land Scam - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం నగరం చుట్టుపక్కల పది వేల కోట్లకుపైగా విలువ చేసే 748 ఎకరాల సింహాచలం ఆలయ భూములను 2016లో దేవదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఆదివారం సంచికలో ‘అప్పన్నకే శఠ గోపం’ శీర్షికతో సంచలనాత్మక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరికొన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూబాగోతానికి సంబంధించి నాటి ప్రభుత్వ ‘ముఖ్య’నేత కనుసన్నల్లో భారీ కుంభకోణానికి రెండేళ్లకు పైగా పకడ్బందీ స్కెచ్‌ నడిచినట్లు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా సింహాచలం ఆలయ భూములను కబ్జా చేసినట్లు తెలిసింది. అలాగే, 2016 డిసెంబరు 14న సింహాచల ఆలయ ఆస్తుల పట్టిక నుంచి 748 ఎకరాలను తొలగించిన జాబితాలో.. టీడీపీ నేతలు చేసిన కబ్జా భూములు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడి భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచే నాటి ప్రభుత్వమే తనంతట తానుగా తొలగించడంతో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతోనే దురాక్రమించుకున్నారని.. ఆ తర్వాత ఆ భూములన్నింటికీ వారే నిజమైన యజమానులుగా చలామణీలోకి వచ్చారన్నది ఒక బలమైన వాదన. 

నిషేధ జాబితాకు ఎక్కకుండా జాగ్రత్తలు
2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా వ్యవసాయ భూములను అన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ‘మీ ఇంటికి మీ భూమి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో దేవదాయ శాఖ కూడా రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న భూములన్నింటినీ అన్‌లైన్‌లో నమోదుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి ఆ మండల పరిధిలో దేవుడి భూములను అన్‌లైన్‌లో నమోదు చేయించే బాధ్యతను ఆయనకు అప్పగించింది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వారీగా భూముల వివరాలను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖకు కూడా పంపి ఆయా భూములకు భవిష్యత్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ల జరగకుండా దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయాల భూములన్నింటినీ ప్రత్యేకంగా 22 (ఏ) (1) (సీ) అన్‌లైన్‌లో నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ సమయంలోనూ అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ 748 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్‌ శాఖ 22(ఏ)(1)(సీ) జాబితా దాకా వెళ్లకుండా పక్కా వ్యూహంతో వ్యవహరించారు. 

సింహాచలం ఆలయ భూములపైనే ప్రత్యేక నివేదిక
ఇదిలా ఉంటే.. ఆలయాల వారీగా 22(ఏ)(1)(సీ) జాబితాలో చేరాల్సిన భూముల వివరాలను జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని అన్ని ఆలయాల వివరాలను ఒక నివేదిక రూపంలో కమిషనర్‌ కార్యాలయానికి తెప్పించుకుంది. అనంతరం ఇదే నివేదికను కమిషనర్‌ కార్యాలయం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపింది. అయితే, విశాఖ జిల్లాలో అన్ని ఆలయాల వివరాలు కమిషనర్‌ కార్యాలయానికి చేరగా.. సింహాచలం ఆలయ నాటి ఈఓ మాత్రం దేవస్థానం పరిధిలోని ఆస్తుల వివరాలను పంపలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఇలా జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాక.. ఆస్తుల వివరాలను అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ ఈఓను సమాచారం కోరినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. నాలుగు నెలల తర్వాత సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల నివేదికను విడిగా పంపినట్లు సమాచారం. 

రికార్డుల తారుమారు?
సింహాచలం దేవస్థానం ఆస్తులకు సంబంధించిన 22(ఏ)(1)(సీ) జాబితాను రిజిస్ట్రార్‌ శాఖకు పంపే ముందు ఆలయ ఆస్తుల రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగించాలన్న నిర్ణయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సింహాచల ఆలయ ఆస్తులకు సంబంధించి 22(ఏ (1)(సీ) జాబితా వివరాలు మొదట ఆలయ ఈఓ ద్వారానే స్థానికంగా ఉండే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపి గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాన్ని ముగించాలన్న ప్రయత్నం జరిగింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా నాటి ఈఓ నేరుగా పంపిన నివేదికను పరిగణనలోకి తీసుకోవడానికి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు సాహసించలేదు. దీంతో నెలల విరామం అనంతరం ఈఓ కమిషనర్‌ కార్యాలయం ద్వారానే రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపారని రెండు వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి.

ఆ అధికారికి అందలం
కాగా.. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాల దేవుడి భూమి తొలగించినప్పుడు ఆలయ ఈఓగా పనిచేసిన అధికారే ఇప్పుడు దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో కమిషనర్‌ తర్వాత స్థాయి ర్యాంకులో అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సదరు ఈఓకు అదనపు కమిషనర్‌గా పదోన్నతి ఇవ్వగా, ఆప్పటి నుంచే ఆయన కమిషనర్‌ కార్యాలయంలో ఆ హోదాలో పనిచేస్తున్నారు.
 
ఆస్తుల గోల్‌మాల్‌పై విచారణ
సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఆస్తుల రిజిస్టర్‌ నుంచి 2016లో ఒకేసారి 748.07 ఎకరాల తొలగింపు వ్యవహరంపై దేవదాయశాఖ విచారణకు ఆదేశించింది. ఆదివారం ‘సాక్షి’లో ఈ బాగోతంపై వచ్చిన కథనం మీద ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావును కోరారు. దీంతో దేవదాయ శాఖ విశాఖపట్నం ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌తో సమగ్ర విచారణకు అర్జునరావు ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement