ఈఓ సుబ్బారెడ్డి
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ సుబ్బారెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బి.సూర్యనారాయణ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్‌లకు గతనెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని భీమడోలుకు చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి సేవాసమితి అధ్యక్షుడు పరిమి వేంకటేశ్వరరెడ్డి గతేడాది నవంబర్ 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
గత ఆగస్టు 8న శ్రీవారి కొండపై వైష్ణవ సంప్రదాయాలకు విరుద్ధంగా జంతుబలి ఇచ్చారని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ వివాదంపై విచారణాధికారిగా నియమితులైన ఏఈవో బీవీఎస్ రామాచార్యులపై ఒత్తిడి తెచ్చి, ఆయన గుండెపోటుతో మృతిచెందడానికి ఈవో సుబ్బారెడ్డి కారకుడయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లోనే నివాసం ఉంటున్న ఈవో.. భక్తులు కాళ్లు కడుక్కునే బహిరంగ ప్రదేశంలో టవల్ కట్టుకుని స్నానం చేయడం వల్ల మహిళా భక్తులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు.
గత అక్టోబర్ 20న స్వామి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించారని పేర్కొన్నారు. ఆలయ ఆస్తిని కాజేస్తున్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రసాదాల తయారీ, సెంట్రల్ స్టోర్, లీజియస్ విభాగాల నుంచి ఈవో ప్రతినెలా రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారని, తలనీలాల కాంట్రాక్టరుకు లాభం చేకూరుస్తూ ఆలయానికి నష్టం కలుగజేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment