
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఎనిమిది ప్రముఖ ఆలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలో ఉండే çపది ఆలయాల్లో భగవద్గీత పారాయణం చేపట్టనున్నారు. గీతా జయంతి పండుగ సందర్భంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు 18 రోజుల పాటు ఆయా ఆలయాల్లో వేద పండితుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం (శ్రీకాకుళం జిల్లా), సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం (విశాఖ జిల్లా), అన్నవరం శ్రీరమా సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం (తూర్పుగోదావరి జిల్లా), ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం (పశ్చిమ గోదావరి), మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (గుంటూరు జిల్లా), నెల్లూరు శ్రీరంగనాథ దేవస్థానం (నెల్లూరు జిల్లా), కదిరి శ్రీలక్ష్మీ నరసింహదేవస్థానం (అనంతపురం), అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ దేవస్థానం (కర్నూలు జిల్లా)లో 18 రోజుల పాటు భగవద్గీత పారాయణం చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయా ఆలయాల ఈవోలను ఆదేశిస్తూ దేవదాయశాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తుగా తగిన ప్రచారం కల్పించాలని ఈవోలను ఆదేశించారు. భగవద్గీత పారాయణ నిర్వహణ ఖర్చులు టీటీడీ భరిస్తుంది.