భద్రాద్రిలో అసలేం జరుగుతోంది?
విగ్రహాల బంగారు తాపడంపై ‘దేవాదాయ’ వివరణ కోరిన సీఎం
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారి పురాతన విగ్రహాల బంగారు తాపడంలో గోల్‌మాల్‌పై సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్‌ను వివరణ కోరారు. రామదాసు కాలం నాటి పురాత న విగ్రహాలకున్న బంగారు తాపడం జీర్ణం కావటంతో కొత్తవి చేయించే క్రమంలో జరిగిన గందరగోళంపై ఇటీవల పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ గందరగోళమేంటో, అసలు ఆలయంలో జరుగుతున్న పనులేంటో తనకు తెలపాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం సీఎం కార్యాలయం నుంచి దేవాదాయశాఖ కార్యదర్శి కార్యాలయానికి శ్రీముఖం అందింది. విగ్రహాల తాపడం కోసం ఎంత బంగారాన్ని కరిగించారు, దాని నాణ్యత, విలువ, అందుకు దేవాదాయశాఖ నుంచి అనుమతులున్నాయా, కొత్తగా మరికొంత బంగారాన్ని కరిగించేందుకు నగరంలోని మింట్‌కు తరలించటం లాంటి అంశాలపై ఎలాంటి విషయాలూ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటంపై అనుమానాలు వెల్లువెత్తాయి. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ అధికారుల వివరణ కోరారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును కూడా ఆయన తప్పుపట్టినట్టు తెలిసింది. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా దీనిపై అధికారులను వివరణ కోరారు.
మీడియాపై ఆంక్షలు
భద్రాచలం: భద్రాచలం దేవ స్థానం అధికారులు తమ తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు ఏకంగా మీడియాపైనే ఆంక్షలు విధించారు. ఆలయ ఉద్యోగులు, అధికారులు, వైదిక సిబ్బంది తన అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ ఈఓ జ్యోతి ఈ నెల 1న అత్యవసర సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమైన విషయాలు తన అనుమతి లేకుండానే మీడియూకు తెలియటం వల్ల దేవస్థానం కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు వచ్చాయని అందులో పేర్కొన్నారు. ఇక నుంచి ఆలయ సమాచారాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి అనుమతి మేరకు పేషీ ద్వారానే మీడియాకు ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుంటే... తొందపాటు నిర్ణయాలతో విమర్శల పాలవుతున్న ఈఓ జ్యోతి హైదరాబాద్‌కు బదిలీ అయినట్టు ప్రచారం సాగుతోంది.