గోల్‌మాల్‌ నిజమే!  | Inquiry Committee Report on Simhachalam and Mansas lands Issue | Sakshi
Sakshi News home page

గోల్‌మాల్‌ నిజమే! 

Published Sun, Jul 18 2021 3:09 AM | Last Updated on Sun, Jul 18 2021 3:09 AM

Inquiry Committee Report on Simhachalam and Mansas lands Issue - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహారాణిపేట (విశాఖ దక్షిణ):  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూములను జాబితాల నుంచి తప్పించడం.. మాన్సాస్‌ ట్రస్టుకు సంబంధించిన భూముల వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలూ నిజమేనని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. దేవదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్‌ భ్రమరాంబ, ఉప కమిషనర్‌ పుష్పావర్ధన్‌ ఈ వ్యవహారంపై విచారణ పూర్తిచేసి నివేదికను ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ పి.అర్జునరావుకు శనివారం సమర్పించారు.

ఈ నివేదికను సోమవారం ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి పంచ గ్రామాల్లోని పలు సర్వే నంబర్లతో పాటు 748 ఎకరాల భూములను జాబితాల నుంచి తప్పించినట్లు కమిటీ నిగ్గుతేల్చింది. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ల (ఇద్దరు ఏసీలు) సాయంతో అప్పటి దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించారని.. దీని వెనుక ఆ శాఖకు చెందిన పలువురితోపాటు, కొందరు సింహాచలం దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. భూములను జాబితాల నుంచి తప్పించడంలో అప్పటి ఈఓ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో స్పష్టంచేసింది.

ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించి.. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్లపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములను దేవస్థానం జాబితాల నుంచి తప్పించిన వ్యవహారంపై విచారణ బృందం పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈవో రామచంద్రమోహన్‌ హయాంలో సిబ్బంది, సెక్యూరిటీ సంస్థల నియామాకం, లీజుల కాల పరిమితి పెంపు, ఇతర వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని కమిటీ సభ్యులు తమ నివేదికలో సిఫారసు చేసినట్టు సమాచారం.

మాన్సాస్‌ భూముల అమ్మకాలు, మెడికల్‌ కాలేజీ ఏర్పాటులో చేతివాటం ప్రదర్శించినట్లు కూడా విచారణ బృందం గుర్తించింది. పలు వస్తువుల కొనుగోళ్లలో హెచ్చు ధరలున్నట్లు నివేదికలో పేర్కొంది. రెండు విడతలుగా విక్రయించిన 150 ఎకరాల్లో కొంత భూమిని  పక్కదారి పట్టించినట్లు గుర్తించింది. 50 ఎకరాల భూమి విక్రయిస్తే అందులో 36 ఎకరాలకే సొమ్ములు వసూలు చేసి, మిగిలిన 14 ఎకరాలు విడిచి పెట్టినట్లు గుర్తించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement