నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ సొమ్మును అక్కడ పని చేసే అధికారులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆలయ ఉన్నత స్థాయి అధికారితో పాటు.. అతని తర్వాతి స్థాయి అధికారి ఓ పద్ధతిగా ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పనిమనిషి పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఈ దోపిడీ పర్వాన్ని ఓ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు.
ఇలా ఇచ్చి.. ఇలా తీసుకుంటారు..
బాసరలో నిత్యపూజలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం వస్తువుల కొనుగోలుతో పాటు అనేక రకాల ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ దేవాదాయ శాఖ బిల్లులు తీసుకుని డబ్బులు చెల్లిస్తుంది. ఇదే విధానం ఇప్పుడు ఇక్కడి అధికారులకు కలిసి వస్తోంది. పూజా సామగ్రి, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేసే దుకాణాల నుంచి ముందుగా అధిక మొత్తంలో బిల్లులు తీసుకొని, ఆ మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు. సదరు దుకాణదారులు తమకు రావాల్సిన అసలైన బిల్లు తీసుకుని, అదనంగా వచ్చిన డబ్బులను తిరిగి అధికారులు సూచించిన బినామీ వ్యక్తి ఖాతాలోకి జమ చేస్తారు. ఇలా సికింద్రాబాద్‌లోని ఓ జనరల్ దుకాణం, మహారాష్ట్రలోని మరో దుకాణం నుంచి ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయి.
బినామీ ఖాతాల నుంచి వాటాలు..
బినామీ వ్యక్తి ఖాతాల్లోకి నగదు చేరిన వెంటనే వాటాల పంపకాలు జరిగిపోతుంటాయి. ఆలయంలోని పెద్దసారు, చిన్నసారుతో పాటు వివిధ స్థాయిల ఉద్యోగులకూ ఇందులో వాటాలు ఉంటాయి. స్థాయిల వారీగా ఈ పంపకాలు జరుగుతాయి. ఇలా బినామీలను పెట్టుకుని కథంతా నడిపేది ఆలయంలో చిన్నసారే కనుక.. ఆయనకు కాస్త ఎక్కువ మొత్తంలో వెళ్తున్నట్లు సమాచారం. ఈ అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా.. తమ కుటుంబసభ్యుల ఖాతాల్లో వేసుకుంటారు.
సిబ్బంది ఎరియర్సూ వదల్లేదు..
ఆలయం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఎరియర్స్‌నూ ఆలయ అధికారులు వదిలి పెట్టలేదు. 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆలయంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.లక్షల్లో ఎరియర్స్ వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఆయా ఏజెన్సీలు అధికారుల బినామీ ఖాతాలో జమ చేయించుకున్నారు. ఎరియర్స్‌కు సంబంధించి డబ్బులో రూ.2 లక్షలను బినామీ వ్యక్తి ఆలయ ఉన్నతాధికారి కోడలి బ్యాంకు అకౌంట్‌లోకి చేర్చడం గమనార్హం. ఎవరికీ అనుమానం రాకుండా రూ.2 లక్షలు ఒకేసారి వేయకుండా ఐదుసార్లు రూ.40 వేల చొప్పున ఈ ఖాతాలో జమచేసినట్లు సమాచారం. ఇక అదే రోజు ద్వితీయ స్థాయి అధికారి ఎవరికీ అనుమానం రాకుండా తన బినామీకి సంబంధించిన ఏటీఎం కార్డు నుంచే డబ్బులు డ్రా చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి వారి స్థాయికి తగ్గట్లు డబ్బులు ముట్టినట్లు తెలిసింది.
చిన్నసారే సూత్రధారి..!
ఆలయంలో కొనసాగుతున్న అవినీతి పర్వానికి అక్కడ కొనసాగుతున్న ద్వితీయ స్థాయి అధికారి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలోనే అక్రమాలకు పాల్పడ్డాడన్న కారణంతో సస్పెండ్ చేసి, అనంతరం కొండగట్టుకు డిప్యుటేషన్‌పై పంపించారు. గోదావరి పుష్కరాలపుడు మళ్లీ పైరవీతో బాసరకే చేరుకున్నారు. అప్పుడు మళ్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో ఇలాంటి అధికారిని ఆలయానికి ఎందుకు తీసుకొచ్చారంటూ ఓ ట్రస్టు బోర్డు సభ్యుడు ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు.
ఇలా చేతులు మారాయి..
- 24–05–2017న మహారాష్ట్రకు చెందిన దుకాణదారుడి నుంచి బినామీ వ్యక్తి ఖాతా (ఎస్‌బీఐ 62211311029)లోకి రూ.1,50,000 జమ అయ్యాయి. అదేరోజు బినామీ వ్యక్తి తన ఖాతాలో నుంచి ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి భార్య అకౌంట్ (62240751111)కు రూ.40 వేలు, రూ.20వేల చొప్పున రెండుసార్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అలాగే చిన్నసారుకు సంబంధించిన ఓ మహిళ ఖాతా (62031507489)లోకి రూ.30 వేలు జమచేశాడు.
- 29–05–2017న ఆలయ అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ఎరియర్స్ రూ.1,05,192 లను ఓ కాంట్రాక్టు ఉద్యోగి అకౌంట్ (52170507610)లోకి జమ చేశారు. సదరు కాంట్రాక్టు ఉద్యోగి అందులో నుంచి వెంటనే బినామీ వ్యక్తికి చెందిన ఖాతా (62211311029)లోకి రూ.40 వేలు, రూ.30 వేల చొప్పున మొత్తం 70వేల రూపాయలు పంపించాడు.
- 29–05–2017 రోజునే వాగ్దేవి కో–ఆపరేటివ్ లేబర్ సొసైటీ నుంచి చెక్ (నం.363101) ద్వారా బినామీ వ్యక్తి ఖాతాలోకి రూ.1,83,200 జమ అయ్యాయి. ఈ డబ్బులు ఆలయంలోని 86 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినవిగా భావిస్తున్నారు.
- ఆలయ సిబ్బంది ఎరియర్స్ 29–05– 2017న బినామీ వ్యక్తి ఖాతాల్లోకి వచ్చిన డబ్బుల్లో నుంచి 30–05–2017న రూ.40వేల చొప్పున ఐదుసార్లు అంటే మొత్తం రూ.2 లక్షలను ఉన్నతాధికారి కోడలి ఖాతా (62495094834)లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.
- 01–06–2017 రోజున బినామీ వ్యక్తి అకౌంట్ నుంచి ఆలయంలోని ఓ చిరు ఉద్యోగి ఖాతా (52170508400)లోకి రూ.10వేలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.
- 06–06–2017 రోజున బినామీ వ్యక్తి ఖాతా నుంచి ద్వితీయ స్థాయి అధికారి భార్య ఖాతా (52170497974)లోకి రూ.26వేలు చేరాయి.
ఎంక్వైరీ చేయిస్తాం..
ఆలయంలో అధికారులు బినామీలను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటివరకు దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా విచారణ చేయిస్తాం. ఈ విషయం నిజమని తేలితే ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటాం. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి బినామీలు లేరు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిస్తాం.
– సుధాకర్‌రెడ్డి, ఈఓ, బాసర ఆలయం
Comments
Please login to add a commentAdd a comment