
సాక్షి, అమరావతి: పండుగలు, జాతరలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో ఉదయం సాయంత్రం వేళ నిర్ణీత సమయంలో ఒకట్రెండు గంటలు మాత్రమే ఆలయాల్లో వీఐపీ దర్శనాలను పరిమితం చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. సాధారణ భక్తులకు సంతృప్త స్థాయిలో తొందరపాటు లేని దర్శనాన్ని సజావుగా అందించడం అత్యంత ప్రాధాన్యతగా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆయా రోజుల్లో వృద్ధులు, చిన్నపిల్లల తల్లులతో పాటు దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సూచన మేరకు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ అన్ని ఆలయాల ఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు..
► పండుగ, జాతర రోజులతో పాటు ఇతర ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలకు, ఉదయం, సాయంత్రం ఒకట్రెండు గంటల పాటు నిర్ణీత సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా ఒకటి లేదా రెండు సాధారణ భక్తుల క్యూలైన్లు కొనసాగించాలి.
► సామాన్య భక్తులకు సాఫీగా సంతృప్త స్థాయిలో దర్శనాలను అందించడం ఆయా ఆలయాల ఈఓల ప్రాథమిక విధి.
► వీఐపీ, అతని కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు మించకుండా చూసుకోవాలి. అంతకుమించి ఉంటే వారు దర్శన టికెట్లు కోనుగోలు చేయాలి.
► పండుగ, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో ఆలయానికి వచ్చే వీఐపీలకు ఆలయ ఈఓ అవసరమైన మర్యాదలు చేసేందుకు వీలుగా వారు ఆలయ సందర్శన షెడ్యూల్‌కు ఒక్క రోజు ముందు వీఐపీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
► ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనాలపై నియంత్రణ ఉండాలి.
► ఈ రోజుల్లో అన్ని రకాల దర్శన టికెట్లను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే విక్రయించాలి. ఇంటర్‌నెట్ సమస్యలు తలెత్తితే పీఓఎస్ వంటి ప్రత్యేక పరికరాల ద్వారా కేటాయించాలి.
► ఈ టికెట్లను క్యూలైన్‌లో స్కాన్‌చేసే విధానం ఏర్పాటుచేసుకోవాలి. అలాగే, స్కానింగ్ జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటుచేసుకోవాలి. ఈ ఫుటేజీ కనీసం 15 రోజుల పాటు బ్యాకప్‌తో ఉండాలి.
► ఉచిత దర్శనం క్యూలైన్లు ఆలయం తెరిచినంతసేపు కొనసాగించాలి.
► దర్శనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారి బాధ్యత తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment