vip dharsanam
-
టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై వాళ్లకు వీఐపీ దర్శనం..
-
పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో.. వీఐపీ దర్శనాలకు పరిమితులు
సాక్షి, అమరావతి: పండుగలు, జాతరలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో ఉదయం సాయంత్రం వేళ నిర్ణీత సమయంలో ఒకట్రెండు గంటలు మాత్రమే ఆలయాల్లో వీఐపీ దర్శనాలను పరిమితం చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. సాధారణ భక్తులకు సంతృప్త స్థాయిలో తొందరపాటు లేని దర్శనాన్ని సజావుగా అందించడం అత్యంత ప్రాధాన్యతగా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆయా రోజుల్లో వృద్ధులు, చిన్నపిల్లల తల్లులతో పాటు దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సూచన మేరకు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ అన్ని ఆలయాల ఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. ► పండుగ, జాతర రోజులతో పాటు ఇతర ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలకు, ఉదయం, సాయంత్రం ఒకట్రెండు గంటల పాటు నిర్ణీత సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా ఒకటి లేదా రెండు సాధారణ భక్తుల క్యూలైన్లు కొనసాగించాలి. ► సామాన్య భక్తులకు సాఫీగా సంతృప్త స్థాయిలో దర్శనాలను అందించడం ఆయా ఆలయాల ఈఓల ప్రాథమిక విధి. ► వీఐపీ, అతని కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు మించకుండా చూసుకోవాలి. అంతకుమించి ఉంటే వారు దర్శన టికెట్లు కోనుగోలు చేయాలి. ► పండుగ, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో ఆలయానికి వచ్చే వీఐపీలకు ఆలయ ఈఓ అవసరమైన మర్యాదలు చేసేందుకు వీలుగా వారు ఆలయ సందర్శన షెడ్యూల్‌కు ఒక్క రోజు ముందు వీఐపీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ► ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనాలపై నియంత్రణ ఉండాలి. ► ఈ రోజుల్లో అన్ని రకాల దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో మాత్రమే విక్రయించాలి. ఇంటర్నెట్ సమస్యలు తలెత్తితే పీఓఎస్ వంటి ప్రత్యేక పరికరాల ద్వారా కేటాయించాలి. ► ఈ టికెట్లను క్యూలైన్లో స్కాన్‌చేసే విధానం ఏర్పాటుచేసుకోవాలి. అలాగే, స్కానింగ్ జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటుచేసుకోవాలి. ఈ ఫుటేజీ కనీసం 15 రోజుల పాటు బ్యాకప్‌తో ఉండాలి. ► ఉచిత దర్శనం క్యూలైన్లు ఆలయం తెరిచినంతసేపు కొనసాగించాలి. ► దర్శనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారి బాధ్యత తీసుకోవాలి. -
5న వీఐపీ బ్రేక్ దర్శనం లేదు: టీటీడీ
తిరుమల: అక్టోబర్ 5న తిరుమలలో బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ పీఆర్వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా అక్టోబర్ 4న వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. నాదనీరాజనంపై బాలకాండ పారాయణం తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం బాలకాండలోని 3 నుంచి 7వ సర్గ వరకు ఉన్న మొత్తం 142 శ్లోకాలను పండితులు పఠించారు. బాలకాండ పారాయణం నిర్వహిస్తోన్న ఎస్వీ వేద వర్సిటీ ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఈ పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద వర్సిటీ అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత వర్సిటీకి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు. -
23 నుంచి తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం 2018, జనవరి ఒకటో తేది పురస్కరించుకుని ఈనెల 23 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే టికెట్లు జారీ చేస్తామని, వీఐపీ సిఫారసులకు టికెట్లు కేటాయించబోమని స్పష్టం చేసింది. ఈనెల 28 నుంచి జనవరి 1 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దివ్యదర్శనం, చంటి బిడ్డల తల్లి దండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం 4 గంటలు ఆలస్యం కానుంది. ఉదయం 5 నుంచి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. తొలుత ప్రొటోకాల్ ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నారు. -
2రోజుల పాటు వీఐపీ దర్శనం రద్దు
తిరుమల : తిరుమల కొండ శనివారం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. దాంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వ దర్శనానికి 36గంటలు, కాలి నడక భక్తులకు 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో టీటీడీ అధికారులు రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాన్ని రద్దు చేశారు. మరోవైపు పెళ్లిళ్లు సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి అధికమైంది. -
వెంకన్నా... నీ సన్నిధిలో రక్షణ లేదా!
ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా..! అంటూ భక్తితో తిరుమలకొండకు చేరుతున్న శ్రీవారి భక్తులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ప్రయాణం, బస, తలనీలాలు, శ్రీవారి దర్శనం.. కొండకు చేరిన భక్తులకు అన్నిటిలోనూ కష్టాలు తప్పడం లేదు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామంటూ గొప్పాలు చెప్పుకునే టీటీడీ ...మాటలకే తప్ప చేతలు శూన్యం. గదులు నుంచి దర్శనం వరకూ వీఐపీలకు అడుగడుగునా.... వడ్డించిన విస్తరి అయితే ... సామాన్య భక్తులు మాత్రం వెంకన్న సాక్షిగా ప్రత్యక్ష నరకమంటే ఏంటో చవి చూస్తారనేది జగమెరిగిన సత్యం. టీటీడీ తిరుమల వెంకన్న అందరివాడు.. అందరి కష్టాలను కడతేర్చేవాడు.. ఆపద మొక్కుల వాడు.. కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా ఆస్వామే దిక్కని అందరూ నమ్ముతారు. అందుకే కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని.. ముడుపులు చెల్లిస్తారు.. అలాంటి స్వామి సన్నిధిలోనే రక్షణ లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. క్షణకాలం దొరికే ఆ స్వామి దర్శనం కోసం ఎన్నో మైళ్లు.. మరెన్నో ఊళ్లు దాటి స్వామి సన్నిధికి చేరుకుంటారు. రోజుకు లక్ష మంది వచ్చే తిరుమలకొండపై ప్రయాణం, బస, తలనీలాలు, శ్రీవారి దర్శనం... వంటి అన్ని చోట్లా భక్తులకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. ప్రతి చోటా రద్దీని బట్టి కనీసం గంట నుంచి 30 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మొక్కులు చెల్లించేందుకు సకుటుంబ సమేతంగా వచ్చిన భక్తులకు తిరుమలకొండపై ఎన్ని కష్టాలు ఎదురైనా వారు చలించకుండా అన్ని బాధలను దిగమింగుకుని, చాలా ఓర్పుతో క్యూలలో వేచి ఉంటూ మొక్కులు చెల్లించి స్వామి దర్శనంతో అప్పటివరకూ పడిన కష్టాలు మరచిపోతుంటారు. ఇప్పటికే సరైన వసతలు లేక అల్లాడుతున్న సామాన్య భక్తులకు తాజాగా పాముల బెడద పట్టిపీడిస్తోంది. ఆదివారం పట్టపగలే ఓ పాము క్యూలో దూరి ఇద్దరు భక్తులను కాటేసింది. దాంతో వారిద్దర్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. దీనికి తోడు నాలుగురోజుల ముందు చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందగా, పది మంది గాయాలపాలయ్యారు. ఇవన్నీ శ్రీవారి సన్నిధిలో భక్తులకు ఊహించని కష్టాలు. అంతు చిక్కని పరీక్షలు. అయితే అనుకోని సంఘటనలు జరుగుతున్నా టీటీడీ మాత్రం నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నచందంగా ఎన్ని విమర్శులు వచ్చినా పట్టించుకోకపోవటం విశేషం.