సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతోపాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్‌ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆరి్థక సహాయం చేస్తోందన్నారు.
19 డీసీ, 22 ఏసీ పోస్టుల పదోన్నతి
ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దేవదాయ శాఖలో కొత్తగా మంజూరు చేసిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కమిషనర్లుగానూ.. వివిధ ఆలయాల్లో గ్రేడ్–1 ఈవోలుగా, ఏఈవోలుగా, కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న మరో 22 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment