సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల కేశ ఖండనశాలల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేశ ఖండనశాలల్లో తలనీలాల కార్యక్రమం కనీసం వంద రోజులు కొనసాగే ఆలయాలలో ఇది వర్తిస్తుందని దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు.
భక్తులు తలనీలాలు సమర్పించే టిక్కెట్ ధరను రూ.40కి పెంచి ఆ మొత్తాన్ని సంబంధిత నాయీ బ్రాహ్మణులకే అందజేస్తారు. రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాల ద్వారా లభించే ఆదాయం రూ.20 వేల కంటే ఎక్కువగా ఉంటే అది కూడా మొత్తం సంబంధిత నాయీ బ్రాహ్మణులకే చెల్లిస్తారు.
ఒకవేళ తగినంత డిమాండ్ లేక టికెట్ల అమ్మకం ద్వారా రూ. 20 వేల కంటే తక్కువ ఆదాయం లభిస్తే తలనీలాలు విక్రయాల ద్వారా సమకూరే మొత్తం నుంచి ఆమేరకు చెల్లించాలని నిర్ణయించారు. టికెట్టు ధర రూ.40కి పెంచడం ద్వారా కేశఖండన శాలలు వంద రోజుల లోపు పనిచేసే ఆలయాలలో సైతం నాయీ బ్రాహ్మణులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి.
నాడు చంద్రబాబు చిందులు..
టీడీపీ అధికారంలో ఉండగా తమకు కనీస ఆదాయం వర్తింపజేయాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తాజాగా జీవో విడుదలైంది.
సముచిత స్థానం..
నాయీ బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే అరుదైన గౌరవాన్ని కల్పించిందని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డులో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
చదవండి: స్పీచ్ అదిరింది.. వాస్తవాలు కళ్లకు కట్టారు..
టీడీపీ హయాంలో అవమానాలు ఎదుర్కొన్న తమకు సీఎం జగన్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర నేతలు గుంటుపల్లి రామదాసు, ఇతర నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు.
Comments
Please login to add a commentAdd a comment