21 మందితో ధార్మిక పరిషత్‌  | AP Govt issued orders Dharmika Parishad with 21 members | Sakshi
Sakshi News home page

21 మందితో ధార్మిక పరిషత్‌ 

Published Tue, Aug 16 2022 3:50 AM | Last Updated on Tue, Aug 16 2022 8:34 AM

AP Govt issued orders Dharmika Parishad with 21 members - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వ పరంగా తీసుకొనే విధాన నిర్ణయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే ధార్మిక పరిషత్‌ పదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటయింది.

దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, ఓ రిటైర్డు హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి, ఓ రిటైర్డు ఐఏఎస్‌ అధికారి, ఒక చార్టెడ్‌ అకౌంటెంట్, ఒక రిటైర్డు దేవదాయ శాఖ అధికారితో పాటు ఆలయాల నిర్మాణంలో ముఖ్య భూమిక ఉండే ఇద్దరు దాతలు, వివిధ ఆలయాల పాలక మండళ్లకు చైర్మన్లుగా ఉన్న ఆరుగురుని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

అధికారవర్గాల నుంచి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో సభ్యులుగా, దేవదాయ శాఖ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా (మెంబర్‌ సెక్రటరీ) ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబరు 571 విడుదల చేసింది. పరిషత్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ఏపీలోగానీ, ప్రస్తుత విభజిత ఏపీలోగానీ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

కమిటీ సభ్యులు 
ధార్మిక పరిషత్‌లో దేవదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవో మినహా మిగిలిన 17 మంది పేర్లు.. 
మఠాధిపతులు: 1) పెద్ద జియ్యంగార్‌ మఠం, తిరుమల 2) పుష్పగిరి మఠం, వైఎస్సార్‌ జిల్లా 
రిటైర్డు హైకోర్టు జడ్జి: మఠం వెంకట రమణ 
రిటైర్డు ప్రిన్సిపల్‌ జడ్జి: కె. సూర్యారావు 
రిటైర్డు ఐఏఎస్‌ అధికారి: అజేయ కల్లం 
ఆగమ పండితులు: పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథాచార్యులు, సీహెచ్‌ శ్రీరామ శర్మ 
చార్టెడ్‌ అకౌంటెంట్‌: శ్రీరామమూర్తి 
దేవదాయ శాఖ రిటైర్డు అధికారి: ఏబీ కృష్ణారెడ్డి (రిటైర్డు అడిషనల్‌ కమిషనర్‌) 
దాతలు: ఎస్‌ నరసింహారావు, యూకే విశ్వనాథ్‌రాజు 
ఆలయ, సత్రాల పాలక మండళ్ల సభ్యులు: ఎం.రామకుమార్‌ రాజు, భీమవరం (జగన్నాథరాజు సత్రం), ఇనుగంటి వెంకట రోహిత్‌ (అన్నవరం), జ్వాలా చైతన్య (యడ్ల పిచ్చయ్య శెట్టి సత్రం, కడప), చక్కా ప్రభాకరరావు (చాకా వారి సత్రం, పాలకొల్లు), మాక్కా బాలాజీ, రంజన్‌ సుభాషిణి. 
 
దేవదాయ శాఖలో పరిషత్‌వి విస్త్రత అధికారాలే.. 
దేవదాయ శాఖ పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో ధార్మిక పరిషత్‌ అత్యంత ఉన్నత కమిటీ. శాఖ పరిధిలోని రూ.25 లక్షల నుంచి రూ. కోటి లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలు, అన్ని రకాల మఠాల పాలన, ధార్మిక వ్యవహారాలు పూర్తి పరిషత్‌ ఆధీనంలో కొనసాగాలి. రాష్ట్రంలో చిన్నా పెద్దవి కలిపి మొత్తం 128 మఠాలు ఉన్నాయి. మంత్రాలయం, హథీరాంజీ మఠం వంటివి ఈ కేటగిరిలోకే వస్తాయి. 
► ఏటా రూ. 25 లక్షలకు పైబడి కోటి రూపాయలకు తక్కువ వార్షికాదాయం వచ్చే ఆలయాలకు ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో పాలక మండళ్ల నియామకం జరుగుతుంది.  
► దేవదాయ శాఖ పరిధిలో ఉండే అలయాలు, సత్రాల కార్యకలాపాలపై తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల్లో  పరిషత్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. 
► వందేళ్లు దాటిన ఆలయాల పునర్నిర్మాణానికి ముందుగా పరిషత్‌ అనుమతి తీసుకోవాలి. 
► హిందూ ధార్మిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో ధార్మిక పరిషత్‌తో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి.  
► నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్‌ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అవసరమైతే ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 
 
ఉమ్మడి ఏపీలో ధార్మిక పరిషత్‌ను తొలిసారి ఏర్పాటు చేసింది వైఎస్సే 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ధార్మిక పరిషత్‌కు దఖలు పడిన అధికారాలన్నీ అంతకు ముందు ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన వెంటనే తొలిసారి ధార్మిక పరిషత్‌ ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరిగాయి. అయితే, పరిషత్‌ ఏర్పాటు జీవో విడుదలకు ముందే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందారు. ఆ తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో విడుదలైంది. అప్పుడు ఏర్పడిన పరిషత్‌ పదవీకాలం 2012లో ముగిసింది.

ఉమ్మడి ఏపీలోనే 2014లో మరోసారి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అది బాధ్యతలు చేపట్టక ముందే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పరిషత్‌ ఏర్పాటుకు ముందే రద్దయింది. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014 – 19 మధ్య రెండు విడతలు ధార్మిక పరిషత్‌ ఏర్పాటుకు దేవదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం 21 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటుకు ముందుకు రాలేదు. తిరిగి పదేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను రెండో విడత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement