ఏడాదిగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
దేవాదాయశాఖ అధికారుల నిర్వాకంతో ఇక్కట్లు
ఎన్‌ఓసీ కోసం ఎదురుచూస్తున్న విక్రయదారులు
నెల్లిమర్ల: దేవాదాయ శాఖ అధికారులు చేసిన నిర్వాకంతో నెల్లిమర్ల పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఏడాది కాలంగా పట్టణంలోని పలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, షాపుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పట్టణంలోని ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న ఆస్తుల క్రయవిక్రయాలన్నీ ఆగిపోయాయి. ఇంత జరుగుతున్న ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్న పట్టణవాసులు..
నెల్లిమర్ల పట్టణంలోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారికి ఎగువనున్న సర్వేనంబరు 104 సబ్‌డివిజన్ 1లోని స్థలాలన్నీ జిరాయితీనే. ఈ సర్వేనంబరులో సుమారు 14 ఎకరాల స్థలముంది. స్థానికులు దశాబ్దాల తరబడి ఇక్కడ పక్కా ఇళ్ళు, షాపులు నిర్మించుకుని ఉంటున్నారు. కానీ ఏడాది కాలంగా ఈ ప్రాంతంలోని ఆస్తుల క్రయ విక్రయాలు ఆగిపోయాయి. దీనికి కారణం కేవలం దేవాదాయ శాఖ అధికారులు చేసిన తప్పిదమేనని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఈప్రాంతంలోని భూమంతా దేవాదాయ శాఖదేనని, వాటిని రిజిస్ట్రేషన్ చెయ్యోద్దని ఆ శాఖాధికారులు గతంలో నెల్లిమర్ల సబ్ రిజిస్టార్‌కు వినతి ఇచ్చారు. దీంతో అప్పటినుంచి ఆ సర్వే నంబరులోని స్థలాలను రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వాస్తవానికి మండలంలోని గొర్లిపేట గ్రామానికి చెందిన సర్వే నంబరు 104లోని సబ్‌డివిజన్ 1లోని భూమి రామతీర్థం దేవస్థానానికి చెందిది. కానీ అప్పట్లో గొర్లిపేట వీఆర్వో పొరపాటున సర్వే నంబరును రిజిస్టార్ కార్యాలయానికి అందించినట్లు సమాచారం.
దీంతో అప్పటినుంచి ఇక్కడున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రోడ్డుకు ఎగువన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆర్వోబి వరకు ఉన్న స్థలాల్లో ఒక్కటి కూడా క్రయవిక్రయాలు జరుపుకోలేదు. దేవాదాయశాఖకు చెందిన భూముల సర్వే నంబర్ల జాబితా నుంచి ఈ ప్రాంతాన్ని తొలగించాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు కల్పించుకుని నెల్లిమర్ల పట్టణంలోని సర్వేనంబరు 104 సబ్ డివిజన్ 1లోని భూములను దేవాదాయశాఖ భూముల జాబితానుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ పాపం ఎవరిది..?
Published Fri, May 13 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement
Advertisement