సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తిరుమల శ్రీవారి తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం సిద్ధమైంది. దాదాపు 15 కేజీలకు పైగా బంగారంతో రథాన్ని తయారు చేయించారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నూతన స్వర్ణ రథం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు దేవదాయ శాఖ నిర్ణయించింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ హాజరవుతారు.
2005లోనే ప్రతిపాదన
2005లోనే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం తయారు చేయించాలని అప్పటి ఆలయ పాలకమండలి తీర్మానించగా.. దేవదాయ శాఖ అనుమతి తెలిపింది. బంగారు రథం కోసం దాతల నుంచి ప్రత్యేక విరాళాలు సేకరించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక హుండీని ఏర్పాటు చేశారు. 2005 నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకు హుండీ ద్వారా రూ.3,57,85,102.85 విరాళాలు వచ్చాయి. దాతల నుంచి రూపంలో మరో రూ.1,67,09,616 కలిపి మొత్తం రూ.5.25 కోట్ల వరకు అందాయి. బంగారు రథం తయారీ బాధ్యతలను దేవదాయ శాఖ 2009లోనే టీటీడీకే అప్పగించింది. ఇందుకు ఆలయ నిధుల నుంచి రూ.కోటి 2010 ఫిబ్రవరిలో టీటీడీకి చెల్లించారు.
సిద్ధమైన వినాయకుని బంగారు రథం
2019 అక్టోబర్‌లో ఊపందుకుని..
2019లో అక్టోబర్‌లో బంగారు రథం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 1,690 కేజీల చెక్క రథానికి బంగారం తాపడం చేయడానికి రూ.9.70 కోట్లు ఖర్చవుతుందని టీటీడీ తేల్చగా.. ఆలయ నిధుల నుంచి మరో రూ.5 కోట్లను కాణిపాకం ఆలయ అధికారులు 2019 అక్టోబర్‌లో టీటీడీకి చెల్లించారు. చెక్క రథానికి బంగారు తాపడం చేసే పనులు 2020 నవంబర్‌లో మొదలు కాగా, 2021 సెప్టెంబర్ నాటికి పూర్తయ్యాయి.
ప్రతి నెలా ఊరేగింపు!
ప్రతి గురువారం లేదా ప్రతి నెలా పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో నిర్వహించే సంకటహర గణపతి వ్రతం సందర్భంగా బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలనే ఆలోచన ఉందని.. దీనిపై ఆలయ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈవో వెంకటేష్ చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో బంగారు రథం ఉపయోగించనున్నట్టు వివరించారు. బంగారు రథం తయారీకి ఇప్పటివరకు టీటీడీకి రూ.6 కోట్లను చెల్లించామని, తుది బిల్లు టీటీడీ నుంచి అందాల్సి ఉందని వెంకటేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment