సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులంతా హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని ఆ శాఖ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో అన్యమతస్తులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ పద్మ సర్క్యులర్ జారీ చేశారు. దేవాలయాలు, దేవదాయ శాఖ కార్యాలయాలు, సంస్థ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించారు.
నిర్ణీత పత్రంలో అఫిడవిట్ 15 రోజుల్లోగా కమిషనర్ కార్యాలయంలో అందచేయాలని సూచించారు. దేవదాయ చట్టం ప్రకారం హిందూ మతస్తులనే ఉద్యోగులుగా, ఆలయాల్లో తీసుకోవాలనే స్పష్టమైన నిబంధన ఉంది. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో పేర్కొన్నారు. రెగ్యులర్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తీసుకోవాల్సిన అఫిడవిట్ ఫ్రొఫార్మను దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలతోపాటు అన్ని దేవదాయ శాఖ సంస్థలు, ఆలయాలకు కమిషనర్ పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment