దేవుళ్లకు శఠగోపం! | devadaya lands grab in chittoor district | Sakshi
Sakshi News home page

దేవుళ్లకు శఠగోపం!

Published Fri, Jul 8 2016 2:02 PM | Last Updated on Sat, Apr 6 2019 9:37 PM

devadaya lands grab in chittoor district

 దేవాలయ భూములు: 22,959 ఎకరాలు 
 సర్వే పూర్తయినవి: 18,134 ఎకరాలు 
 దేవాదాయ శాఖ ఆధీనం: 14,392 ఎకరాలు 
 ఆక్రమణకు గురైనవి: 4 వేల ఎకరాలు
 సింహభాగం అధికార పార్టీ నేతల గుప్పెట్లో.. 
 
జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఏకంగా దేవుళ్లకే శఠగోపం పెడుతూ అందిన కాడికి ఆక్రమించేశారు. పెపైచ్చు బినామీ పేర్లతో రికార్డులు సృష్టించి విక్రయించేందుకూ యత్నిస్తున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వీరికి పాలకులు, రెవెన్యూ అధికారులు దన్నుగా ఉండడంతో అక్రమార్కులు మూడు కుంటలు.. ఆరు ఎకరాలు అన్న చందంగా కబ్జా చేసేస్తున్నారు. ఆక్రమణదారుల్లో సింహభాగం తెలుగు తమ్ముళ్లదే’. 
 
చిత్తూరు(రూరల్): చిత్తూరు జిల్లాలో ఆలయ భూముల ఆక్రమణ పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. దేవుళ్లకు సంబంధించి 6 ఏ కేటగిరీ కింద 5 ఆలయాలు, 6 బీ కేటగిరీ కింద 25 ఆలయాలు, 6 సీ కేటగిరీ కింద 3170 ఆలయాలు ఉన్నాయి. అలాగే సత్రాలు 277,  మఠాలు 33 ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లాలో  దేవాదాయశాఖ లెక్కల ప్రకారం భూములు 22,959 ఎకరాలు ఉండాలి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు  మీ ఇంటికి-మీ భూమిలో భాగంగా దేవాదాయ శాఖ భూములపై ఏడాది పాటు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మొత్తం 18,134 ఎకరాల భూములు మాత్రమే సర్వే చేయగలిగారు. ఇందులో 14,392 మాత్రం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నట్లు, మిగతా 4 వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు సర్వేలో తేల్చారు. సర్వే చేపడుతున్న సమయంలో పలు ప్రాంతాల్లో అడ్డంకులు వచ్చాయి.
 
ఆక్రమణకు గురైన దేవాదాయ భూముల్లో చాలా వరకు టీడీపీ నాయకుల చేతిలోనే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని వేణుగోపాల స్వామి, విరుపాక్షమ్మ ఆలయ భూములు సుమారు 50 ఎకరాల వరకు ఓ టీడీపీ నాయకుడి ఆధీనంలోనే ఉంది. దీనిపై సంబంధిత అధికారులు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారు. సీంఎం పేరును వాడుకుని రెచ్చిపోతున్నారు. పెనుమూరు మండలంలోని రామలింగేశ్వర ఆలయ భూములు, పుంగనూరు మండలంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ, చౌడేపల్లి మండలంలోని మృత్యంజయ స్వామి ఆలయ, వేణుగోపాల స్వామి ఆలయాల భూములు 180 ఎకరాల వరకు టీడీపీ నాయకులు ఆక్రమణలు చేసుకోని దేవాదాయ శాఖ భూములకే శఠ గోపం పెట్టారు. ఇలా అనేక మండలంలోని ఉన్న దేవాదాయ శాఖ ఆస్థులపై టీడీపీ నాయకులు బరితెగించి ఆక్రమణలు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. 
 
తిరుపతిలో నో సర్వే..
తిరుపతి నగరంలో 8 వేల ఎకరాల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములపై సర్వే జరగలేదు. దీనిపై  పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నాయకులకు.. అధికారులు అమ్ముడు పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
వేల కోట్ల భూములు ఆక్రమణ...
ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే 2 వేల ఎకరాల భూములను ఆక్రమణదారులు దోచుకున్నారు. ఇక్కడ  అడుగు భూమి రూ.7 నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. కోట్లాది రూపాయలు విలువైన భూములను ఆక్రమణదారులు వారి ఆధీనంలో ఉంచుకుని పెత్తనం చెల్లాయిస్తున్నారు. అలాగే  చిత్తూరులో 331 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. రామసముద్రం మండలంలో 282 ఎకరాలు, ఏర్పేడు 37, చంద్రగిరి, 20, పిచ్చాటూరు 24, పెనుమూరు 35, నిండ్ర, 2, వడమాల పేట  30, సదుం 250, నాగాల పురం 25, చిన్నగొట్టికల్లు 34, చౌడేపల్లి 26, కలకడ 29,పులిచెర్ల 26, పెద్దమాండ్యం 24, పుత్తూరు 24, ఐరాల 10, కురబలకోట 100, సత్యవేడు 84, రేణిగుంట 49, కలికిరి 16, బంగరుపాళ్యం 10, తవణంపల్లి 20, పాకాల 84, పెద్ద తిప్పసముద్రం 37, మదనపల్లి 43, కుప్పం 14, గుడిపల్లె 26, శాంతిపురం 15, బెరైడ్డిపల్లి 27 ఎకరాల్లో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇతర మండలాల్లోనూ చిన్నా చితకా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం సంబంధిత జిల్లా అధికారులు తెలిసిన మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  
 
ఆదాయానికి గండి...
దేవాదాయశాఖ ఆధీనంలోని భూములు వేల ఎకరాల్లో ఆక్రమణకు గురవడంతో లక్షల రూపాయల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఓ అంచనా ప్రకారం సంవత్సరానికి ఈ భూముల నుంచి రూ. 80 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.55 లక్షలు మాత్రమే వస్తోంది. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటే అదనంగా మరో రూ. 25 లక్షలకు పైగా దేవాదాయశాఖకు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉన్నతాధికారులైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement