Benami property
-
మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన ప్లాట్‌ను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అటాచ్ చేసింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోని నొయిడాలో ఏడెకరాల్లో బినామీ పేరుతో ఉన్న ఈ స్థలం అసలు యజమాని మాయా సోదరుడు ఆనంద్ కుమార్, అతని భార్యకు చెందినట్లుగా ఐటీ అనుమానిస్తోంది. కాగా, కుమార్‌ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐటీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) ఈ మేరకు ఈ నెల 16వ తేదీన అటాచ్మెంట్ ఉత్తర్వులు వెలువరించింది. నోయిడాలోని సెక్టర్ 94లో 28వేలకు పైగా చదరపు మీటర్లు అంటే సుమారు ఏడెకరాల వాణిజ్య భూమిలో ఫైవ్‌స్టార్ హోటల్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని ఆనంద్‌కుమార్, అతని భార్య విచితర్ లత ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇది వారి పేరు బదులు మరొకరి పేరుతో ఉంది. మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూమి కొనుగోలు కోసం ఆరు బినామీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అక్రమ సంపాదనను హవాలా మార్గంలో మళ్లించినట్లు ఐటీ విభాగం అనుమానిస్తోంది. బినామీ చట్టం–1988ని మోదీ ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తోంది. ఈ చట్టం కింద దోషిగా తేలిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు సదరు ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం మేర జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఐటీ చట్టం–1961 ప్రకారం కూడా విచారించే వీలుంటుంది. దేశంలో బినామీ ప్రొహిబిషన్ చట్టం అమలు అధికారం ఐటీ విభాగానికి ఉంది. -
బినామీ కేసులకు అప్పిలేట్ ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీల కేసుల సత్వర విచారణకు అపిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా అప్పిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థలు విధులు నిర్వర్తించనున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ప్రాధికార సంస్థకు అనుబంధ బెంచ్‌లు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన జారీ అయింది. ఈ సంస్థ చైర్మన్‌ను సంప్రదించిన తరువాత బెంచ్‌ల ఏర్పాటుపై నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో బినామీ కేసులు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారమవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద తీసుకున్న చర్యలకు న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థ తొలి సమీక్ష వేదికగా పనిచేస్తుంది. ప్రాధికార సంస్థ ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. ఆశా సమన్వయకర్తల భత్యాల పెంపు: ఆశా సమన్వయకర్తల పర్యవేక్షణ భత్యాలను పెంచడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. అక్టోబర్ నుంచి ఒక్కో క్షేత్రస్థాయి పర్యవేక్షణ పర్యటనకు రూ.250కి బదులు రూ.300 చెల్లిస్తారు. ఫలితంగా ఆశా సమన్వయకర్తలు నెలకు పొందే మొత్తం వేతనం రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరగనుంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 41 వేల ఆశా సమన్వకర్తలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం పట్ల ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆశా కార్యకర్తల నుంచే సమన్వయకర్తలను ఎంపికచేస్తారు. ∙ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్ఎస్) ఏర్పాటుకు ఆమోదం. -
బినామీ సునామీ
-
నోట్లరద్దే కాదు.. వాటినీ టార్గెట్ చేయలి!
పట్నా: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలన్నీ ఆందోళనబాట పడుతుండగా.. ప్రతిపక్ష పార్టీకి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మాత్రం దృఢంగా కేంద్రానికి అండగా నిలుస్తున్నారు. పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తున్నానని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. బినామీ ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన కేంద్రానికి సూచించారు. పెద్దనోట్ల రద్దే కాదు.. బినామీ ఆస్తులు, మద్యపానాన్ని లక్ష్యంగా చేసుకోవాలని, బినామీ ఆస్తులపై కొరడా ఝళిపించడంతోపాటు, మద్యపాన నిషేధం విధించాలని ఆయన సూచించారు. నల్లధనానికి ప్రధాన మౌలిక వనరుగా బినామీ ఆస్తులు, మద్యపానం నిలుస్తున్నాయని అన్నారు. గతంలోనూ పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా నితీశ్‌కుమార్ బాహాటంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రత్యర్థి పార్టీ అయినా నితీశ్ పెద్దనోట్ల రద్దును ఆది నుంచి స్వాగతిస్తుండటం గమనార్హం. -
దేవుళ్లకు శఠగోపం!
దేవాలయ భూములు: 22,959 ఎకరాలు సర్వే పూర్తయినవి: 18,134 ఎకరాలు దేవాదాయ శాఖ ఆధీనం: 14,392 ఎకరాలు ఆక్రమణకు గురైనవి: 4 వేల ఎకరాలు సింహభాగం అధికార పార్టీ నేతల గుప్పెట్లో.. జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఏకంగా దేవుళ్లకే శఠగోపం పెడుతూ అందిన కాడికి ఆక్రమించేశారు. పెపైచ్చు బినామీ పేర్లతో రికార్డులు సృష్టించి విక్రయించేందుకూ యత్నిస్తున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వీరికి పాలకులు, రెవెన్యూ అధికారులు దన్నుగా ఉండడంతో అక్రమార్కులు మూడు కుంటలు.. ఆరు ఎకరాలు అన్న చందంగా కబ్జా చేసేస్తున్నారు. ఆక్రమణదారుల్లో సింహభాగం తెలుగు తమ్ముళ్లదే’. చిత్తూరు(రూరల్): చిత్తూరు జిల్లాలో ఆలయ భూముల ఆక్రమణ పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. దేవుళ్లకు సంబంధించి 6 ఏ కేటగిరీ కింద 5 ఆలయాలు, 6 బీ కేటగిరీ కింద 25 ఆలయాలు, 6 సీ కేటగిరీ కింద 3170 ఆలయాలు ఉన్నాయి. అలాగే సత్రాలు 277, మఠాలు 33 ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లాలో దేవాదాయశాఖ లెక్కల ప్రకారం భూములు 22,959 ఎకరాలు ఉండాలి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ ఇంటికి-మీ భూమిలో భాగంగా దేవాదాయ శాఖ భూములపై ఏడాది పాటు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మొత్తం 18,134 ఎకరాల భూములు మాత్రమే సర్వే చేయగలిగారు. ఇందులో 14,392 మాత్రం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నట్లు, మిగతా 4 వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు సర్వేలో తేల్చారు. సర్వే చేపడుతున్న సమయంలో పలు ప్రాంతాల్లో అడ్డంకులు వచ్చాయి. ఆక్రమణకు గురైన దేవాదాయ భూముల్లో చాలా వరకు టీడీపీ నాయకుల చేతిలోనే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని వేణుగోపాల స్వామి, విరుపాక్షమ్మ ఆలయ భూములు సుమారు 50 ఎకరాల వరకు ఓ టీడీపీ నాయకుడి ఆధీనంలోనే ఉంది. దీనిపై సంబంధిత అధికారులు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారు. సీంఎం పేరును వాడుకుని రెచ్చిపోతున్నారు. పెనుమూరు మండలంలోని రామలింగేశ్వర ఆలయ భూములు, పుంగనూరు మండలంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ, చౌడేపల్లి మండలంలోని మృత్యంజయ స్వామి ఆలయ, వేణుగోపాల స్వామి ఆలయాల భూములు 180 ఎకరాల వరకు టీడీపీ నాయకులు ఆక్రమణలు చేసుకోని దేవాదాయ శాఖ భూములకే శఠ గోపం పెట్టారు. ఇలా అనేక మండలంలోని ఉన్న దేవాదాయ శాఖ ఆస్థులపై టీడీపీ నాయకులు బరితెగించి ఆక్రమణలు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. తిరుపతిలో నో సర్వే.. తిరుపతి నగరంలో 8 వేల ఎకరాల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములపై సర్వే జరగలేదు. దీనిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నాయకులకు.. అధికారులు అమ్ముడు పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల భూములు ఆక్రమణ... ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే 2 వేల ఎకరాల భూములను ఆక్రమణదారులు దోచుకున్నారు. ఇక్కడ అడుగు భూమి రూ.7 నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. కోట్లాది రూపాయలు విలువైన భూములను ఆక్రమణదారులు వారి ఆధీనంలో ఉంచుకుని పెత్తనం చెల్లాయిస్తున్నారు. అలాగే చిత్తూరులో 331 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. రామసముద్రం మండలంలో 282 ఎకరాలు, ఏర్పేడు 37, చంద్రగిరి, 20, పిచ్చాటూరు 24, పెనుమూరు 35, నిండ్ర, 2, వడమాల పేట 30, సదుం 250, నాగాల పురం 25, చిన్నగొట్టికల్లు 34, చౌడేపల్లి 26, కలకడ 29,పులిచెర్ల 26, పెద్దమాండ్యం 24, పుత్తూరు 24, ఐరాల 10, కురబలకోట 100, సత్యవేడు 84, రేణిగుంట 49, కలికిరి 16, బంగరుపాళ్యం 10, తవణంపల్లి 20, పాకాల 84, పెద్ద తిప్పసముద్రం 37, మదనపల్లి 43, కుప్పం 14, గుడిపల్లె 26, శాంతిపురం 15, బెరైడ్డిపల్లి 27 ఎకరాల్లో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇతర మండలాల్లోనూ చిన్నా చితకా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం సంబంధిత జిల్లా అధికారులు తెలిసిన మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆదాయానికి గండి... దేవాదాయశాఖ ఆధీనంలోని భూములు వేల ఎకరాల్లో ఆక్రమణకు గురవడంతో లక్షల రూపాయల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఓ అంచనా ప్రకారం సంవత్సరానికి ఈ భూముల నుంచి రూ. 80 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.55 లక్షలు మాత్రమే వస్తోంది. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటే అదనంగా మరో రూ. 25 లక్షలకు పైగా దేవాదాయశాఖకు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉన్నతాధికారులైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది.