మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్‌ | IT dept attaches benami property of Mayawati's brother worth Rs 400 cr | Sakshi
Sakshi News home page

మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్‌

Published Fri, Jul 19 2019 4:19 AM | Last Updated on Fri, Jul 19 2019 4:19 AM

IT dept attaches benami property of Mayawati's brother worth Rs 400 cr - Sakshi

న్యూఢిల్లీ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన ప్లాట్‌ను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అటాచ్‌ చేసింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లోని నొయిడాలో ఏడెకరాల్లో బినామీ పేరుతో ఉన్న ఈ స్థలం అసలు యజమాని మాయా సోదరుడు ఆనంద్‌ కుమార్, అతని భార్యకు చెందినట్లుగా ఐటీ అనుమానిస్తోంది. కాగా, కుమార్‌ను బీఎస్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి ఇటీవల నియమించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐటీకి చెందిన బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్‌(బీపీయూ) ఈ మేరకు ఈ నెల 16వ తేదీన అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు వెలువరించింది. నోయిడాలోని సెక్టర్‌ 94లో 28వేలకు పైగా చదరపు మీటర్లు అంటే సుమారు ఏడెకరాల వాణిజ్య భూమిలో ఫైవ్‌స్టార్‌ హోటల్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని ఆనంద్‌కుమార్, అతని భార్య విచితర్‌ లత ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇది వారి పేరు బదులు మరొకరి పేరుతో ఉంది. మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఈ భూమి కొనుగోలు కోసం ఆరు బినామీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అక్రమ సంపాదనను హవాలా మార్గంలో మళ్లించినట్లు ఐటీ విభాగం అనుమానిస్తోంది. బినామీ చట్టం–1988ని మోదీ ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తోంది. ఈ చట్టం కింద దోషిగా తేలిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు సదరు ఆస్తి మార్కెట్‌ విలువలో 25 శాతం మేర జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఐటీ చట్టం–1961 ప్రకారం కూడా విచారించే వీలుంటుంది. దేశంలో బినామీ ప్రొహిబిషన్‌ చట్టం అమలు అధికారం ఐటీ విభాగానికి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement