k anandh
-
మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన ప్లాట్‌ను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అటాచ్ చేసింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోని నొయిడాలో ఏడెకరాల్లో బినామీ పేరుతో ఉన్న ఈ స్థలం అసలు యజమాని మాయా సోదరుడు ఆనంద్ కుమార్, అతని భార్యకు చెందినట్లుగా ఐటీ అనుమానిస్తోంది. కాగా, కుమార్‌ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐటీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) ఈ మేరకు ఈ నెల 16వ తేదీన అటాచ్మెంట్ ఉత్తర్వులు వెలువరించింది. నోయిడాలోని సెక్టర్ 94లో 28వేలకు పైగా చదరపు మీటర్లు అంటే సుమారు ఏడెకరాల వాణిజ్య భూమిలో ఫైవ్‌స్టార్ హోటల్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని ఆనంద్‌కుమార్, అతని భార్య విచితర్ లత ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇది వారి పేరు బదులు మరొకరి పేరుతో ఉంది. మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూమి కొనుగోలు కోసం ఆరు బినామీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అక్రమ సంపాదనను హవాలా మార్గంలో మళ్లించినట్లు ఐటీ విభాగం అనుమానిస్తోంది. బినామీ చట్టం–1988ని మోదీ ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తోంది. ఈ చట్టం కింద దోషిగా తేలిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు సదరు ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం మేర జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఐటీ చట్టం–1961 ప్రకారం కూడా విచారించే వీలుంటుంది. దేశంలో బినామీ ప్రొహిబిషన్ చట్టం అమలు అధికారం ఐటీ విభాగానికి ఉంది. -
అవగాహనతోనే పారదర్శక పాలన
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పారదర్శక పాలన అందించాలంటే పరిపాలనపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కె.ఆనంద్ చెప్పారు. జెడ్పీ సమావేశపు హాలులో మచిలీపట్నం డివిజన్లోని కోడూరు, బంటుమిల్లి, మొవ్వ, మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, పెడన, గూడూరు, కృత్తివెన్ను, ఘంటసాల మండలాల సర్పంచులకు శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ప్రారంభించిన డీపీవో మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇక్కడ నేర్చుకున్న విషయాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. పంచాయతీకి ఆదాయ వనరులు ఎలా వస్తాయి, వాటిని ఎలా వినియోగించాలి తదితర అంశాలపై పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉంటే గ్రామస్థాయిలో పరిపాలన సులువుగా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జెడ్పీ ఉప కార్యనిర్వహణాధికారి జీవీ సూర్యనారాయణ మాట్లాడుతూ పంచాయతీ నిధులు, అధికారాలు, బాధ్యతలు, పాలనాపరమైన అంశాలను వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. మచిలీపట్నం డీఎల్పీవో వి.వరప్రసాద్, గుడ్లవల్లేరు ఎంపీడీవో కేశవరెడ్డి, ముదినేపల్లి ఎంపీడీవో పి.విద్యాసాగర్, గూడూరు ఎంపీడీవో పద్మ శిక్షణా తరగతుల ప్రతినిధులు జాన్సన్, మేరీ విజయకుమార్ పాల్గొన్నారు.