పారదర్శక పాలన అందించాలంటే పరిపాలనపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కె.ఆనంద్ చెప్పారు. జెడ్పీ సమావేశపు హాలులో మచిలీపట్నం డివిజన్‌లోని కోడూరు, బంటుమిల్లి, మొవ్వ, మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, పెడన, గూడూరు, కృత్తివెన్ను, ఘంటసాల మండలాల సర్పంచులకు శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ :
పారదర్శక పాలన అందించాలంటే పరిపాలనపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కె.ఆనంద్ చెప్పారు. జెడ్పీ సమావేశపు హాలులో మచిలీపట్నం డివిజన్‌లోని కోడూరు, బంటుమిల్లి, మొవ్వ, మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, పెడన, గూడూరు, కృత్తివెన్ను, ఘంటసాల మండలాల సర్పంచులకు శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ప్రారంభించిన డీపీవో మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇక్కడ నేర్చుకున్న విషయాలను ఉపయోగించుకోవాలని చెప్పారు.
పంచాయతీకి ఆదాయ వనరులు ఎలా వస్తాయి, వాటిని ఎలా వినియోగించాలి తదితర అంశాలపై పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉంటే గ్రామస్థాయిలో పరిపాలన సులువుగా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జెడ్పీ ఉప కార్యనిర్వహణాధికారి జీవీ సూర్యనారాయణ మాట్లాడుతూ పంచాయతీ నిధులు, అధికారాలు, బాధ్యతలు, పాలనాపరమైన అంశాలను వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. మచిలీపట్నం డీఎల్‌పీవో వి.వరప్రసాద్, గుడ్లవల్లేరు ఎంపీడీవో కేశవరెడ్డి, ముదినేపల్లి ఎంపీడీవో పి.విద్యాసాగర్, గూడూరు ఎంపీడీవో పద్మ శిక్షణా తరగతుల ప్రతినిధులు జాన్సన్, మేరీ విజయకుమార్ పాల్గొన్నారు.