panchayathi officer
-
పంచాయతీనిధులకు రెక్కలు!
కర్నూలు(అర్బన్): జిల్లాలోని పంచాయతీల్లోని ఆదాయ, వ్యయాలపై అజమాయిషీ కరువైంది. దీంతో పలువురు మాజీ సర్పంచులు, ఆయా పంచాయతీల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతూ యథేచ్ఛగా నిధులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. పంచాయతీలకు స్థానిక వనరుల నుంచి సమకూరే ఆదాయంతో పాటు ప్రతి ఏడాది 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు వస్తుంటాయి. వీటి వ్యయంపై పర్యవేక్షణ కొరవడడంతో పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యవహారాలు ఇప్పటికే వెలుగులోకి వస్తుండగా, మరికొన్ని పంచాయతీల్లో గుట్టుగానే సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్ సొమ్మును కూడా కాజేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా నాలుగు పంచాయతీల్లో దాదాపు రూ.1.50 కోట్ల మేర అక్రమాలు జరిగాయని సంబంధిత అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆలూరు, పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీల్లో ఆదోని డివిజనల్ పంచాయితీ అధికారి హెచ్ వీరభద్రప్ప ప్రత్యేక దృష్టి సారించడంతో నిధుల దుర్వినియోగం అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.26 లక్షలు మాత్రమే రికవరీ కాగా... మిగిలిన సంఘటనల్లో విచారణల పేరుతో కాలక్షేపంచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ గ్రామ పంచాయితీలో ఏ మేర అక్రమాలు జరిగాయంటే ... ♦ పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీలో రూ.64 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.26 లక్షలను రికవరీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన సొమ్ము ఎప్పుడు రికవరీ చేస్తారో ? విచారణ పేరుతో కాలయాపన చేస్తారో అధికారులే చెప్పాల్సి ఉంది. ♦ ఆస్పరి మండలం ములుగుందం గ్రామ పంచాయితీలో మాజీ సర్పంచు రూ.35 లక్షల మేర దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సంఘటనకు సంబంధించి విచారణ పేరుతో కాలయాపన చేసిన అధికారులు చివరకు చేసేదేమీ లేక సంబంధిత మాజీ సర్పంచుపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ♦ ఇదే మండలం బిల్లేకల్లు గ్రామ పంచాయితీలో మార్కెట్ నిధులు రూ.5 లక్షలను పంచాయతీ కార్యదర్శి తన సొంతానికి వాడుకోవడంతో ఆయనపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు. ♦ ఆలూరు మేజర్ గ్రామ పంచాయితీలో ఒక జూనియర్ అసిస్టెంట్ రూ.32 లక్షలు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ అసిస్టెంట్‌పై క్రిమినల్ కేసును కూడా నమోదు చేశారు. ఈ సొమ్మును రికవరీ చేసేందుకు ఆర్ఆర్ యాక్ట్‌ను ప్రయోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ♦ రుద్రవరం గ్రామ పంచాయితీలో పంచాయతీ కార్యదర్శి రూ.15 లక్షలు దుర్వినియోగం చేయడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇక్కడ కూడా విచారణ పెండింగ్‌లోనే ఉంది. ♦ పంచాయతీ నిధులతో పాటు దొర్నిపాడు, ఆత్మకూరు మండలం కురుకుంద, తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామాల్లో మృతి చెందిన వారి పేర్ల మీద మంజూరైన దాదాపు రూ.2 లక్షల పెన్షన్ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకున్నందున ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ♦ నంద్యాల మండలం రైతునగరం పంచాయతీలో కూడా పలు అవకతవకలు జరిగినట్లు సమాచారం. చర్యలు తీసుకుంటాం పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న నిధుల వ్యవహారానికి సంబంధించి ఆడిట్ అధికారి విచారణ పూర్తి చేసి అందించిన నివేదికలను కలెక్టర్‌కు పంపాం. త్వరలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే ములుగుందం మాజీ సర్పంచుపై క్రిమినల్ కేసు నమోదు చేయించాం. దేవనకొండ పంచాయతీకి సంబంధించిన వ్యవహారంపై జెడ్పీ డిప్యూటీ సీఈఓ విచారణ పెండింగ్‌లో ఉంది. రుద్రవరం గ్రామ పంచాయతీలో జరిగిన దుర్వినియోగంపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.–కేఎల్ ప్రభాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి -
ఏసీబీ వలలో పంచాయతీ కమిషనర్
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : ఏసీబీ అధికారుల దాడులతో నగర పంచాయతీ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతికి అడ్డాగా మారిన ఇక్కడ చేయి తడపనిదే పని కాకపోవడంతో ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు పక్కా ప్లాన్ ప్రకారం బుధవారం నగర పంచాయతీ కమిషనర్ వీ సత్యనారాయణను వలవేసి పట్టుకున్నారు. రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కమిషనర్ పట్టుబడటంతో పట్టణంలో కలకలం రేపింది. రాజాం గాంధీనగర్‌కు చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జామి వెంకటసుమన్ వద్ద హౌస్ ప్లానింగ్ అప్రూవల్ నిమిత్తం నగర పంచాయతీ కమిషనర్ వేగి సత్యనారాయణను కలిశారు. ఇందుకోసం రూ. 12 వేలు డిమాండ్ చేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ వ్యక్తి ఐదు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు వారి సూచనలతో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో రూ. 12వేలను నగర పంచాయతీ లైసెన్స్ ప్లానర్స్ వాసుతో కలిపి కమిషనర్‌కు ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఈ నగదును కమిషనర్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కే రాజేంద్ర, సీఐలు భాస్కరరావు, హరి పట్టుకున్నారు. కెమికల్ టెస్టుల అనంతరం కమిషనర్ లంచం తీసుకున్న విషయం వాస్తవం కావడంతో కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు అప్పగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రతి పనికీ లంచమే... రాజాం నగర పంచాయతీలో ఏ పని కావాలన్నా లంచం చెల్లించాల్సిందే. దీంతోనే ఇక్కడ బ్రోకర్లు రాజ్యమేలుతోంది. వారితోనే మొత్తం తంతు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం కూడా లైసెన్స్ ప్లానర్ ఎల్ వాసు ద్వారా కమిషనర్ జామి వెంకటసుమన్ వద్ద లంచం తీసుకున్నారు. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. గతంలో చాలామంది బాధితులు ఇలా లంచం చెల్లించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించలేక మిన్నుకుండిపోయారు. వెంకటసుమన్ మాత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించి అవినీతి అధికారి లంచగొండితనాన్ని బయటపెట్టారు. ఈ కార్యాలయంలో మరికొంతమంది అవినీతి అధికారులు ఉన్నారని రాజాం పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నా కమిషనర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు వెంకటసుమన్ తెలిపారు. -
గ్రామ పంచాయతీ ఉద్యోగుల ప్రమోషన్లలో అక్రమాలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : లంచాలు అడగని రోజులు రావాలి.. అక్రమాలకు అడ్డుకట్ట పడాలి.. అధికారుల తీరు మారాలి వంటి మాటాలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. రోజులు మారుతున్న అక్రమాలు ఆగడంలేదు. తాజాగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంటెండర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన ప్రమోషన్ల ప్రక్రియలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులతో పాటు సూర్యాపేట జిల్లా ఉద్యోగులు చేతి వాటం చూపినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కొక్క ఉద్యోగి నుంచి అందినకాడికి పైసలు గుంజుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.20వేల నుంచి రూ.30 వేలు వసూలు పంచాయతీ కార్యాలయాలలో 2002 సం వత్సరం నుంచి 2008 సంవత్సరం వరకు అటెండర్‌గా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న వారికి అర్హత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బిల్ కలెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 27 మంది అంటెండర్లకు బిల్ కలెక్టర్‌గా ప్రమోషన్ లభించింది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 21 మందికి నల్గొండ జిల్లాలో న లుగురు, యాదాద్రి జిల్లాలో ఇద్దరు అటెండర్లకు బిల్ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే ఉమ్మడి గ్రామ పంచాయతీ జిల్లా అధికారులు ప్రమోషన్ కల్పించేందుకు ఒక్కోక్క ఉద్యోగి నుంచి రూ. 20 వేలు వసూళ్లు చేసినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా.. సూర్యాపేట జిల్లాలో అత్యధికం అటెండర్లకు బిల్ కలెక్టర్‌గా ప్రమోషన్లు రావడంతో ఇక్కడి జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగుల పంట పడింది. ప్రమోషన్ ఆడర్లు ఇవ్వడానికి జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అందరి చేతులు తడిపితే తప్ప ప్రమోషన్ ఆడర్ చేతికి రాలేదని అంటున్నారు. ఒక్కోక్క ఉద్యోగి నుంచి రూ. 20 నుంచి రూ. 30 వేలు వసూళ్లు చేసినట్లు బహిరంగంగానే చర్చించికుంటున్నారు. ముఖ్యంగా జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న ఒక సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి పావులు కదిపినట్లు సమాచారం. ప్రమోషన్లు వస్తుడంటంతో ఉద్యోగులు కూడా విషయాన్ని బయటకు పొక్కకుండా చూస్తురని పలువురు ఆరోపిస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగి నుంచి.. జిల్లాలో గ్రామ పంచాయతీ అటెండర్లతో పాటు గ్రేడ్ 2 స్థాయి కార్యదర్శులకు గ్రేడ్ 1 కార్యదర్శులుగా ప్రమోషన్ కల్పించారు. అదే విధంగా జిల్లాలో పని చేస్తున్న ఈఓపీఆర్డీలకు ఎంపీడీఓలుగా ప్రమోషన్లు లభించాయి. వీరి ప్రమోషన్ల ప్రక్రియ కమిషనరేట్ పరిధిలో జరిగిన జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగుల చేతులు తడిచినట్లు తెలుస్తోంది. పైలు పైస్థాయికి కదలడానికి క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి అధికారి వరకు అంద రికి కొంత సొమ్ము ముట్టచెప్పక తప్పలేదని అంటున్నారు. అక్రమాల విషయం నా దృష్టికి రాలేదు గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న అటెండర్లకు ప్రమోషన్ ప్రక్రియ ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగింది. ఉమ్మడి జిల్లా అధికారులు సీనియారిటీ, అర్హత ప్రకారం ప్రమోషన్లు కల్పించి జిల్లాకు నివేదిక అందించారు. ప్రమోషన్ పొందిన వారికి ప్రమోషన్ ఆర్డర్ అందించాం. క్రింది స్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు నా దృష్టికి రాలేదు. – రాంమోహన్‌రాజు, జిల్లా పంచాయతీ అధికారి -
అవగాహనతోనే పారదర్శక పాలన
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పారదర్శక పాలన అందించాలంటే పరిపాలనపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కె.ఆనంద్ చెప్పారు. జెడ్పీ సమావేశపు హాలులో మచిలీపట్నం డివిజన్లోని కోడూరు, బంటుమిల్లి, మొవ్వ, మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, పెడన, గూడూరు, కృత్తివెన్ను, ఘంటసాల మండలాల సర్పంచులకు శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ప్రారంభించిన డీపీవో మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇక్కడ నేర్చుకున్న విషయాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. పంచాయతీకి ఆదాయ వనరులు ఎలా వస్తాయి, వాటిని ఎలా వినియోగించాలి తదితర అంశాలపై పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉంటే గ్రామస్థాయిలో పరిపాలన సులువుగా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జెడ్పీ ఉప కార్యనిర్వహణాధికారి జీవీ సూర్యనారాయణ మాట్లాడుతూ పంచాయతీ నిధులు, అధికారాలు, బాధ్యతలు, పాలనాపరమైన అంశాలను వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. మచిలీపట్నం డీఎల్పీవో వి.వరప్రసాద్, గుడ్లవల్లేరు ఎంపీడీవో కేశవరెడ్డి, ముదినేపల్లి ఎంపీడీవో పి.విద్యాసాగర్, గూడూరు ఎంపీడీవో పద్మ శిక్షణా తరగతుల ప్రతినిధులు జాన్సన్, మేరీ విజయకుమార్ పాల్గొన్నారు.