ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కమిషనర్ సత్యనారాయణ
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : ఏసీబీ అధికారుల దాడులతో నగర పంచాయతీ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతికి అడ్డాగా మారిన ఇక్కడ చేయి తడపనిదే పని కాకపోవడంతో ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు పక్కా ప్లాన్ ప్రకారం బుధవారం నగర పంచాయతీ కమిషనర్ వీ సత్యనారాయణను వలవేసి పట్టుకున్నారు. రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కమిషనర్ పట్టుబడటంతో పట్టణంలో కలకలం రేపింది. రాజాం గాంధీనగర్‌కు చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జామి వెంకటసుమన్ వద్ద హౌస్ ప్లానింగ్ అప్రూవల్ నిమిత్తం నగర పంచాయతీ కమిషనర్ వేగి సత్యనారాయణను కలిశారు. ఇందుకోసం రూ. 12 వేలు డిమాండ్ చేశారు.
దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ వ్యక్తి ఐదు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు వారి సూచనలతో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో రూ. 12వేలను నగర పంచాయతీ లైసెన్స్ ప్లానర్స్ వాసుతో కలిపి కమిషనర్‌కు ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఈ నగదును కమిషనర్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కే రాజేంద్ర, సీఐలు భాస్కరరావు, హరి పట్టుకున్నారు. కెమికల్ టెస్టుల అనంతరం కమిషనర్ లంచం తీసుకున్న విషయం వాస్తవం కావడంతో కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు అప్పగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రతి పనికీ లంచమే...
రాజాం నగర పంచాయతీలో ఏ పని కావాలన్నా లంచం చెల్లించాల్సిందే. దీంతోనే ఇక్కడ బ్రోకర్లు రాజ్యమేలుతోంది. వారితోనే మొత్తం తంతు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం కూడా లైసెన్స్ ప్లానర్ ఎల్ వాసు ద్వారా కమిషనర్ జామి వెంకటసుమన్ వద్ద లంచం తీసుకున్నారు. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. గతంలో చాలామంది బాధితులు ఇలా లంచం చెల్లించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించలేక మిన్నుకుండిపోయారు. వెంకటసుమన్ మాత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించి అవినీతి అధికారి లంచగొండితనాన్ని బయటపెట్టారు. ఈ కార్యాలయంలో మరికొంతమంది అవినీతి అధికారులు ఉన్నారని రాజాం పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నా కమిషనర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు వెంకటసుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment