పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని పంచాయతీల్లోని ఆదాయ, వ్యయాలపై అజమాయిషీ కరువైంది. దీంతో పలువురు మాజీ సర్పంచులు, ఆయా పంచాయతీల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతూ యథేచ్ఛగా నిధులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. పంచాయతీలకు స్థానిక వనరుల నుంచి సమకూరే ఆదాయంతో పాటు ప్రతి ఏడాది 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు వస్తుంటాయి. వీటి వ్యయంపై పర్యవేక్షణ కొరవడడంతో పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యవహారాలు ఇప్పటికే వెలుగులోకి వస్తుండగా, మరికొన్ని పంచాయతీల్లో గుట్టుగానే సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్ సొమ్మును కూడా కాజేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా నాలుగు పంచాయతీల్లో దాదాపు రూ.1.50 కోట్ల మేర అక్రమాలు జరిగాయని సంబంధిత అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆలూరు, పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీల్లో ఆదోని డివిజనల్ పంచాయితీ అధికారి హెచ్ వీరభద్రప్ప ప్రత్యేక దృష్టి సారించడంతో నిధుల దుర్వినియోగం అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.26 లక్షలు మాత్రమే రికవరీ కాగా... మిగిలిన సంఘటనల్లో విచారణల పేరుతో కాలక్షేపంచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏ గ్రామ పంచాయితీలో ఏ మేర అక్రమాలు జరిగాయంటే ...
♦ పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీలో రూ.64 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.26 లక్షలను రికవరీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన సొమ్ము ఎప్పుడు రికవరీ చేస్తారో ? విచారణ పేరుతో కాలయాపన చేస్తారో అధికారులే చెప్పాల్సి ఉంది.
♦ ఆస్పరి మండలం ములుగుందం గ్రామ పంచాయితీలో మాజీ సర్పంచు రూ.35 లక్షల మేర దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సంఘటనకు సంబంధించి విచారణ పేరుతో కాలయాపన చేసిన అధికారులు చివరకు చేసేదేమీ లేక సంబంధిత మాజీ సర్పంచుపై క్రిమినల్ కేసును నమోదు చేశారు.
♦ ఇదే మండలం బిల్లేకల్లు గ్రామ పంచాయితీలో మార్కెట్ నిధులు రూ.5 లక్షలను పంచాయతీ కార్యదర్శి తన సొంతానికి వాడుకోవడంతో ఆయనపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు.
♦ ఆలూరు మేజర్ గ్రామ పంచాయితీలో ఒక జూనియర్ అసిస్టెంట్ రూ.32 లక్షలు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ అసిస్టెంట్‌పై క్రిమినల్ కేసును కూడా నమోదు చేశారు. ఈ సొమ్మును రికవరీ చేసేందుకు ఆర్‌ఆర్ యాక్ట్‌ను ప్రయోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
♦ రుద్రవరం గ్రామ పంచాయితీలో పంచాయతీ కార్యదర్శి రూ.15 లక్షలు దుర్వినియోగం చేయడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇక్కడ కూడా విచారణ పెండింగ్‌లోనే ఉంది.
♦ పంచాయతీ నిధులతో పాటు దొర్నిపాడు, ఆత్మకూరు మండలం కురుకుంద, తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామాల్లో మృతి చెందిన వారి పేర్ల మీద మంజూరైన దాదాపు రూ.2 లక్షల పెన్షన్ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకున్నందున ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.
♦ నంద్యాల మండలం రైతునగరం పంచాయతీలో కూడా పలు అవకతవకలు జరిగినట్లు సమాచారం.
చర్యలు తీసుకుంటాం
పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న నిధుల వ్యవహారానికి సంబంధించి ఆడిట్ అధికారి విచారణ పూర్తి చేసి అందించిన నివేదికలను కలెక్టర్‌కు పంపాం. త్వరలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే ములుగుందం మాజీ సర్పంచుపై క్రిమినల్ కేసు నమోదు చేయించాం. దేవనకొండ పంచాయతీకి సంబంధించిన వ్యవహారంపై జెడ్పీ డిప్యూటీ సీఈఓ విచారణ పెండింగ్‌లో ఉంది. రుద్రవరం గ్రామ పంచాయతీలో జరిగిన దుర్వినియోగంపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.–కేఎల్ ప్రభాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment