పెద్దనోట్ల రద్దుపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మాత్రం దృఢంగా కేంద్రానికి అండగా నిలుస్తున్నారు.
పట్నా: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలన్నీ ఆందోళనబాట పడుతుండగా.. ప్రతిపక్ష పార్టీకి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మాత్రం దృఢంగా కేంద్రానికి అండగా నిలుస్తున్నారు. పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తున్నానని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు.
బినామీ ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన కేంద్రానికి సూచించారు. పెద్దనోట్ల రద్దే కాదు.. బినామీ ఆస్తులు, మద్యపానాన్ని లక్ష్యంగా చేసుకోవాలని, బినామీ ఆస్తులపై కొరడా ఝళిపించడంతోపాటు, మద్యపాన నిషేధం విధించాలని ఆయన సూచించారు. నల్లధనానికి ప్రధాన మౌలిక వనరుగా బినామీ ఆస్తులు, మద్యపానం నిలుస్తున్నాయని అన్నారు. గతంలోనూ పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా నితీశ్‌కుమార్ బాహాటంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రత్యర్థి పార్టీ అయినా నితీశ్ పెద్దనోట్ల రద్దును ఆది నుంచి స్వాగతిస్తుండటం గమనార్హం.