
నోట్ల రద్దుతో కలిగిన లాభమేంటి?
పట్నా: పాత పెద్దనోట్ల రద్దు వల్ల కలిగిన సత్ఫలితాలను ప్రజలకు తెలపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్రాన్ని కోరారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కార్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా మంగళవారం జేడీ(యూ) ఈబీసీ విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఉద్దేశం సరైనది కాబట్టే ఆ నిర్ణయానికి మద్దతిచ్చినట్లు తెలిపారు. ప్రధాని 50 రోజుల గడువు కోరారని, ఇప్పటికి 77 రోజులు గడిచినందున నోట్ల రద్దు ప్రయోజనాలేంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
లెక్కాపత్రంలేని, దాచిన ధనం బ్యాంకు డిపాజిట్ల రూపంలో తిరిగి వ్యవస్థలోకి వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. తిరిగొచ్చిన మొత్తం నగదులో నల్లధనం వాటా ఎంతో కూడా కేంద్రం వెల్లడించాలని కోరారు. నోట్ల రద్దు వల్ల పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగ కార్మికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుకు మద్దతును కొనసాగించాలని, కానీ దాని అమలులో వైఫల్యాల్ని ఎత్తిచూపాలని జేడీయూ సోమవారం నిర్ణయించింది.