
మిత్రపక్షంపై మొదలైన విమర్శనాస్త్రాలు
నితీశ్‌పై పరోక్షంగా లాలూ విసుర్లు
పట్నా: ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బాహాటంగా మద్దతు పలుకుతుండటంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన అసంతృప్తి వెళ్లగక్కారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో జత కట్టడానికి నితీశ్ నిరాకరిస్తుండటంపై లాలూ పరోక్ష విమర్శలు చేశారు. కొందరి వ్యక్తిగత అహం (ఈగో) వల్ల ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో నితీశ్ జేడీయూ, లాలూ ఆర్జేడీ మిత్రపక్షాలుగా సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు అంశం సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలకు తావిస్తోంది.
తాజాగా విలేకరులతో మాట్లాడిన లాలూ నేరుగా నితీశ్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయనపై విమర్శలు గుప్పించారు. నోట్లరద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రతిపక్షాలన్నింటికీ భావసారూప్యత ఉన్నప్పటికీ.. అవి ఒకే వేదికపైకి రావడానికి కొందరి వ్యక్తిగత అహం అడ్డుపడుతున్నదని లాలూ అన్నారు. నోట్లరద్దుకు వ్యతిరేకంగా ధర్నాకు ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము మాత్రం ఆందోళన చేపట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.