నితీశ్ ఓ అవకాశవాది: లాలూ
స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసమే: రాహుల్
రాంచీ: బిహార్ ముఖ్యమంత్రిగా ఆరోసారి గురువారం ప్రమాణం చేసిన నితీశ్ ఓ అవకాశవాది అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దుయ్యబట్టారు. ఇదంతా బీజేపీ వెన్నుదన్నులతోనే జరిగిందని ఆరోపించారు. బిహార్ తాజా పరిణామాలపై తాము న్యాయపరంగా ముందుకెళ్తామని లాలూ పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీ వ్యతిరేకిగా నితీశ్ వ్యవహరించడమంతా ఆ రెండు పార్టీలు (జేడీయూ, బీజేపీ) కలిసి ఆడిన డ్రామానేనని అన్నారు. ‘ఆయన ఓ అవకాశవాది. మతవాద శక్తులకు వ్యతిరేకంగా బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన తుంగలో తొక్కారు.
2015 ఎన్నికల్లో సొంత బలంపై గెలవలేనని తెలుసుకుని...అల్పసంఖ్యాక, వెనుకబడిన వర్గాల్లో మా పార్టీకి మంచి పట్టుండటంతో నా సాయం కోరారు. మా అవినీతిని గురించి ప్రశ్నించడానికి ఆయనేమైన సీబీఐ డైరెక్టరా లేక పోలీసు శాఖ డైరెక్టరా?’ అని లాలూ ప్రశ్నించారు. ‘రాష్ట్ర శాసనసభలో మాదే అతిపెద్ద పార్టీ. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ ముందు మమ్మల్ని పిలిచి బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. మేం విఫలమై ఉంటే, జేడీయూను పిలిచి ఉండాల్సింది’ అని లాలూ చెప్పుకొచ్చారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా మాట్లాడుతూ గవర్నర్ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్తామన్నారు.
మళ్లీ మతవాదులతో కలిశారు: రాహుల్
బిహార్‌లో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే నితీశ్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపారని అన్నారు. గత మూడు నాలుగు నెలల నుంచే కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ‘మతవాద వ్యతిరేక పోరాటంలో నితీశ్ మాతో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగత స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం...మేం ఉమ్మడిగా ఎవరిపై పోరాటం జరిపామో వారికి చేరువయ్యారు’ అని రాహుల్ పేర్కొన్నారు.
నాపై కక్షతోనే ఇలా చేశారు: తేజస్వి
బీజేపీ, జేడీయూలు కలిసి తనపై కక్షగట్టి, తనను మంత్రిపదవి నుంచి తప్పించేందుకే ఇదంతా చేశాయని బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, లాలూ కొడుకు తేజస్వి ఆరోపించారు. ‘నా మంచి పనితీరు మా మాజీ మిత్రపక్షాన్ని, బీజేపీని ఆందోళనకు గురిచేసింది. నాపై పన్నిన ఈ కుట్ర వారి క్రూరత్వాన్ని బయటపెట్టింది’ అని తేజస్వీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఏ మచ్చా లేకుండా నేను ప్రభుత్వంలో అడుగుపెట్టాను. బిహార్ ప్రజలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న ఆకాంక్షతో వచ్చాను. అవకాశవాద ప్రత్యర్థిగా జేడీయూని గుర్తించడానికే నేను ఇక్కడకు వచ్చానని అర్థమవుతోంది’ అంటూ మరో ట్వీట్ చేశారు.