సాక్షి, అమరావతి: సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్‌లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ శాఖలో ఉన్నతాధికారులకు కూడా తెలీకుండా గుట్టుగా ఆలయ ఈఓ స్థాయిలో సాగుతున్న ఈ భూబాగోతం వ్యవహారం గురించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఉప్పు అందింది. దీంతో అప్పటి కమిషనర్ ఈ మొత్తం తతంగంపై విచారణకు మౌఖికంగా ఆదేశిలిచ్చారు. ఈ నేపథ్యంలో.. కమిషనర్ కార్యాలయంలో భూముల వ్యవహారాలను పర్యవేక్షించే అధికారితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది.
ఆరు పేజీలతో కమిషనర్‌కు నివేదిక
కాగా, ఆలయాల ఆస్తుల రిజిస్టర్‌లో పేర్కొన్న భూముల వివరాల వారీగా ఆ ముగ్గురు అధికారులు మూడ్రోజులపాటు విచారణ జరిపి కమిషనర్‌కు ఆరు పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో.. ఎవరి నుంచి ఎలాంటి వినతులు రాకుండా ఏకపక్షంగా సదరు 748 ఎకరాలు దేవుడి భూములు కావని ప్రకటించే అధికారం ఎవరికీ లేదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. భూములు తమవిగా ప్రజల నుంచి వినతి వచ్చినప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం విచారణ జరిపి వాటికి కమిషనర్ ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్‌ఓసీ) జారీచేయాల్సి ఉంటుందని అందులో వివరించారు. లేదంటే.. దీనిపై ఎవరైనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే ట్రిబ్యునల్ తగిన ఆదేశాలు జారీచేస్తుందంటూ దేవదాయ శాఖ చట్టంలోని నిబంధనలను ఆ ముగ్గురు అధికారులు తమ నివేదికలో స్పష్టంచేశారు. కాగా, ఈ ఆరు పేజీల నివేదిక ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద భద్రంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అందరూ సైలెంట్..
ఇదిలా ఉంటే.. ముగ్గురు అధికారులు అప్పటి కమిషనర్‌కు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ స్థాయిలో ఈ భూముల గోల్‌మాల్ యథేచ్ఛగా కొనసాగింది. కానీ, అప్పటి కమిషనర్ సహా సంబంధిత శాఖ ఉన్నతాధికారులందరూ ఒక్కసారిగా గప్‌చుప్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం.. అప్పటి ప్రభుత్వ ముఖ్యుల నుంచి అందిన ఆదేశాలే కారణమని విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment