పాత బస్టాండ్ వద్ద దేవాదాయ శాఖకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్
బొబ్బిలి విజయనగరం : ఎంతో విలువైన దేవాదాయ శాఖకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపులను వేలం వేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఆంజనేయస్వామి దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ ఆలయానికి చెందిన స్థలంతో పాటు మున్సిపాలిటీ స్థలంలో మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు.
ఈ కాంప్లెక్స్‌కు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరి గంగయ్య పేరు పెట్టారు. అయితే దేవాదాయ శాఖ మా స్థలంలో కట్టిన షాపులను మాకు అప్పగించాలని కోర్టుకు వెళ్లారు. చివరకు ఏళ్ల తరబడి నడచిన ఈ కేసు సుమారు ఎనిమిది నెలల కిందట కోర్టు ఆ షాపులు దేవాదాయ శాఖకు చెందుతాయని తీర్పిచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే నేటికీ ఆ షాపులను వేలం వేయడం లేదు. ఇదిగో అదిగో అని తాత్సారం చేస్తున్నారే తప్ప షాపులకు వేలం వేయడం లేదు. ఇదిలా ఉంటే పైరవీలు చేసుకున్న వారికే షాపులు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్కో దుకాణానికి నెలసరి అద్దె రూ.4 వేల నుంచి పది వేల రూపాయల వరకు పలుకుతోంది.
అలాగే డిపాజిట్లు కూడా రూ. లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది.అయితే దుకాణాల వేలాన్ని దేవాదాయ శాఖాధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఔత్సాహికులు షాపులను దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్నారు.
బహిరంగ వేలం అయితే ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే షాపులు కేటాయించాలి. అయితే కౌన్సిలర్లు, కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగ వేలం కాకుండా అడ్డుపడుతున్నారు. కోర్టు వేలంపాట నిర్వహించుకోవాలని చెప్పినప్పుడు దేవాదాయ శాఖాధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై ఈఓ శ్రీనివాసరావును వివరణ కోరగా స్థలాల కొలతలను బట్టి అద్దెలుంటాయనీ, ఈనెల 27న వేలం ప్రక్రియను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరికీ తెలిసేలా కరపత్రాలు పంచి వేలం ధరను నిర్ణయిస్తామన్నారు. ఇప్పటివరకూ కొన్ని దుకాణలకు వసూలు చేసిన అద్దెలు మున్సిపాలిటీ వద్దనే ఉండొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment