‘రికార్డు’స్థాయిలో మాయ ! | Endowment lands are in kabja | Sakshi
Sakshi News home page

‘రికార్డు’స్థాయిలో మాయ !

Published Sat, Dec 20 2014 2:31 AM | Last Updated on Sat, Apr 6 2019 9:37 PM

Endowment lands are in kabja

పైడితల్లి అయినా....పైడమ్మ అయినా అన్నీ ఆ అమ్మపేర్లే అనుకున్నారో ఏమో...ఏ పేరుతో రికార్డులుంటే ఏమవుతుందని భావించారో ఏమో తెలియదు గాని సుమారు రూ. 3 కోట్ల విలువైన  భూమి  రెవెన్యూ రికార్డుల్లో పైడితల్లి అమ్మవారి పేరుమీద నమోదై ఉండగా,    ఓ టీడీపీ కౌన్సిలర్ తల్లి అయిన పైడమ్మ పేరుమీద అడంగల్‌లో నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయనగరం మున్సిపాలిటీ : దేవాదాయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయా? వ్యూహాత్మకంగా కోట్లాది రూపాయల విలువైన భూమి చేతులు మారిపోతున్నాయా?.... అంటే,  వీటీ అగ్రహారంలో గల 1.70 ఎకరాల భూమి వ్యవహారాన్ని చూస్తే ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ శివారుల్లో గల దేవదాయశాఖ భూములకు రక్షణ కరువైంది.  జిల్లా కేంద్రం కావటం...  రోజు రోజుకు భూముల విలువ పెరిగిపోవడంతో  గుళ్లు, బడులు, శ్మశానాలు ఇలా వేటినీ వదలకుండా కబ్జాచేసేస్తున్నారు.  

ఇదే తరహాలో స్థానిక 24వ వార్డు పరిధిలో గల వి.టి.అగ్రహారంలో కొలువుదీరిన  పైడితల్మమ్మవారి పేరుపై ఉన్న 1.70 ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ మొత్తం భూమి విలువ సుమారు రూ. 3 కోట్ల పైమాటే.  ఈ ప్రాంతంలో సర్వే నంబర్ 153/1లో  గల 1.70 ఎకరాల భూమిని గతంలో కొందరు  అమ్మవారి ఆలయానికి అందజేశారని  స్థానికులు తెలిపారు.  ఈ భూమిని సాగు చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో అమ్మవారి ధూప, దీప , నైవేద్యాలు జరుగుతూ ఉండేవి. ఇంతటి విలువైన భూమిపై కన్నేసిన  కబ్జాదారులు  ఈ ఏడాది ఆరంభంలో భూమి హద్దుల గుండా ఉన్న తాటి చెట్లను తొలగించేశారు.

ఎటువంటి అనుమతులు లేకుండానే రియల్టర్లు అమ్మవారికి చెందిన సుమారు ఆరు సెంట్ల స్థలం గుండా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత జరిగినప్పటికీ దేవదాయ శాఖ అధికారులు కనీసం స్పందించలేదు. స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా.. పరిశీలన జరిపి తూతూమంత్రంగా  రోడ్డుకు ఇరువైపులా వేసిన కాల్వలను తొలగించి వదిలేశారు. ఈ సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమ్మవారి భూమిని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు.  అధికార  పార్టీకి చెందిన కౌన్సిలర్ రొంగలి రామారావు  జోక్యం ఉండంతోనే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు  ఆరోపిస్తున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో అమ్మవారి పేరు... అడంగల్ కాపీపై వేరే పేరు
వి.టి.అగ్రహారం పైడితల్లమ్మవారికి  చెందిన  1.70 ఎకరాల భూమి ఇప్పుడు  ఎవరి పేరుపై ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రెవెన్యూ రికార్డులో సదరు భూమి  అమ్మవారి పేరుపై ఉండగా.. మీసేవా ఇటీవల జారీ చేసిన అడంగల్ కాపీలో మాత్రం రొంగలి పైడిమ్మ పేరు ఉంది.

దేవాదాయ శాఖ భూమే...
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ పుష్పనాథంను వివరణ కోరగా...అది అమ్మవారి ఆలయానికి చెందిన భూమేనని చెప్పారు. అండగల్‌లో పేరుమార్పు, భూమి ఆక్రమణ విషయం తనకు తెలియదని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆర్‌ఐ ఏమన్నారంటే...
వి.టి.అగ్రహరం పైడితల్లమ్మవారికి చెందిన భూమి విషయంపై ఆర్‌ఐ కోటేశ్వరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్  153/1 చెందిన 1.70 సెంట్ల భూమి అమ్మవారి పేరుమీద ఉందని చెప్పారు. అయితే మీసేవా ద్వారా జారీ అయిన అడంగల్ కాపీ చూసిన ఆర్‌ఐ ఎక్కడో తప్పు జరిగి ఉండవచ్చని చెప్పుకొచ్చారు.

తహశీల్దార్  ఏమన్నారంటే..
ఇదే భూమిలో రియల్టర్లు  అక్రమంగా రోడ్డు వేయడం పట్ల  విజయనగ రం తహశీల్దార్  కోరాడ.శ్రీనివాసరావును సాక్షి ప్రశ్నించగా.. ఈ విషయంపై ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన జరిపినట్లు చెప్పారు.  2008-09 సంవత్సరంలో  జరిగిన తప్పులు కారణంగా రికార్డుల్లో పేరు మారి ఉండవచ్చని తెలిపారు. అయితే అక్కడ జరుగుతున్న అక్రమాలపై  జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపించామని, ఆయన వద్ద నుంచి ఆదేశాల వచ్చిన తరువాత   చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కౌన్సిలర్  రామారావు వివరణ
‘మా తాత( కోరాడ దాలిప్ప)  పేరున ఈ భూమి ఉంది.   మధ్యలో ఎవరో రికార్డులో  మార్చేశారు. దానధర్మంగా ఇచ్చినట్టు చెప్పుకొస్తున్నారు. కానీ  మా వద్ద డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. కోర్టులో తేల్చుకుంటాం. ’ అని కౌన్సిలర్ రొంగలి రామారావు ‘సాక్షి’ వద్ద తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement