
ఆదిలాబాద్‌లో తాళం వేసి ఉన్న వేంకటేశ్వర ఆలయం
నిర్మల్‌టౌన్: జిల్లాలోని దేవాదాయశాఖ పరిధిలో గల అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలను అర్చకులు, ఆలయ సిబ్బంది నిలిపివేశారు. మూడురోజులుగా ఆర్జిత సేవలు నిలిచిపోగా, కైంకర్యం(నిత్యపూజలు, మహానైవేద్యం) మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 577 జీవోను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ జీవో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో అర్చకులు, సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 27 దేవాలయాల్లో 332 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
ఏడాదైనా మోక్షం లేదు..
దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదన్న చందంగా మారింది దేవాదాయశాఖ ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి. అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో నంబర్ 577 విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు జీవో అమలుకు నోచుకోలేదు. అలాగే కేడర్ ఫిక్సేషన్‌లో జరిగిన అవకతవకలను కూడా సరిచేయాలని అర్చక, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారు ఆలయాల్లో నిత్యపూజలు, మహానైవేద్యం యథావిధిగా సమర్పిస్తూ, ఆర్జిత సేవలను మాత్రం నిలిపివేశారు. శుక్రవారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్చక, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలి..
అర్చక, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. 577 జీవో విడుదల చేసి ఏడాదవుతున్నా రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,625 మందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 792మందికి వేతనాలు అమలు చేస్తున్నారు. వీరికి కూడా దేవాలయ నిధి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రెండు పద్దులలో వేతనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ఒకే పద్దు ద్వారా వేతనాలు అందిచాలని వారు కోరుతున్నారు.
క్యాడర్ ఫిక్సేషన్‌తో అభద్రతభావంలో ఉద్యోగులు..
క్యాడర్ ఫిక్సేషన్ పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో తాము అభద్రతాభావానికి గురవుతున్నామని అర్చక, ఉద్యోగులు చెబుతున్నారు. 2014 కంటే ముందు నుంచి పనిచేస్తున్న అర్హులను గుర్తించి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జోన్ల వారీగా సమావేశం నిర్వహించారు. క్యాడర్ ఫిక్సేషన్ తర్వాత అర్హులైన వారందరికీ హామీ ప్రకారం వేతనాలు అమలు పరిచే అవకాశం ఉంది. ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అర్చక, ఉద్యోగులు కోరుతున్నారు.
వెంకన్న గుడికి తాళం అర్చకుల సమ్మె ఎఫెక్ట్
577 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్
ఎదులాపురం(ఆదిలాబాద్): జీవో 577 ప్రకారం వేతనాలు చెల్లించాలని అర్చక, ఉద్యోగులు సమ్మె బాట పట్టగా అర్జిత సేవలు నిలిచిపోయి భక్తుల రాలేక ఆలయాలు వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రంలోని మర్వాడీ ధర్మశాల వేంకటేశ్వర ఆలయంలో అర్చక, ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఆదివారానికి మూడోరోజుకు చేరుకుంది. అర్చక, ఉద్యోగులు మాట్లాడుతూ తమకు జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. వారితో సమానంగా అన్ని అలవెన్సులను అందించాలన్నారు. సమ్మెలో అర్చక, ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లప్ప చంద్రశేఖర్, అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పనకంటి విలాస్‌శర్మ, అర్చకులు సునీల్‌కుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ప్రభుత్వం ఏడాది క్రితం అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ట్రెజరీ ద్వారా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. – జగన్నాథస్వామి, దేవరకోట ఆలయ అర్చకుడు, నిర్మల్
సేవలు నిలిపివేశాం
రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు ఆలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేశాం. కేవలం నిత్యపూజలు, మహానైవేద్యాన్ని సమర్పిస్తున్నాం. ఆలయాలను తెరిచే ఉంచి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం మా ఆవేదన అర్థం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలి. – నవీన్, దేవరకోట

దేవరకోట ఆలయ చైర్మన్ కిషన్‌కు వినతిపత్రం అందిస్తున్న ఆలయ అర్చకులు, ఉద్యోగులు