priests salaries
-
అర్చకుల జీతాలు 25 శాతం పెంచుతాం
సాక్షి, అమరావతి : అర్చకుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన అర్చక సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్చకులకు సంబంధించిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్చకుల జీతాలను 25శాతం పెంచుతామని చెప్పారు. వంశపారంపర్య అర్చకత్వంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్చకుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని, వారి బాగుకోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం, దేవాదాయశాఖ అధికారులు, 13 జిల్లాల అర్చక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆర్జిత సేవలు బంద్
నిర్మల్‌టౌన్: జిల్లాలోని దేవాదాయశాఖ పరిధిలో గల అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలను అర్చకులు, ఆలయ సిబ్బంది నిలిపివేశారు. మూడురోజులుగా ఆర్జిత సేవలు నిలిచిపోగా, కైంకర్యం(నిత్యపూజలు, మహానైవేద్యం) మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 577 జీవోను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ జీవో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో అర్చకులు, సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 27 దేవాలయాల్లో 332 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఏడాదైనా మోక్షం లేదు.. దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదన్న చందంగా మారింది దేవాదాయశాఖ ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి. అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో నంబర్ 577 విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు జీవో అమలుకు నోచుకోలేదు. అలాగే కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలను కూడా సరిచేయాలని అర్చక, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారు ఆలయాల్లో నిత్యపూజలు, మహానైవేద్యం యథావిధిగా సమర్పిస్తూ, ఆర్జిత సేవలను మాత్రం నిలిపివేశారు. శుక్రవారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్చక, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలి.. అర్చక, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. 577 జీవో విడుదల చేసి ఏడాదవుతున్నా రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,625 మందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 792మందికి వేతనాలు అమలు చేస్తున్నారు. వీరికి కూడా దేవాలయ నిధి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రెండు పద్దులలో వేతనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ఒకే పద్దు ద్వారా వేతనాలు అందిచాలని వారు కోరుతున్నారు. క్యాడర్ ఫిక్సేషన్తో అభద్రతభావంలో ఉద్యోగులు.. క్యాడర్ ఫిక్సేషన్ పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో తాము అభద్రతాభావానికి గురవుతున్నామని అర్చక, ఉద్యోగులు చెబుతున్నారు. 2014 కంటే ముందు నుంచి పనిచేస్తున్న అర్హులను గుర్తించి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జోన్ల వారీగా సమావేశం నిర్వహించారు. క్యాడర్ ఫిక్సేషన్ తర్వాత అర్హులైన వారందరికీ హామీ ప్రకారం వేతనాలు అమలు పరిచే అవకాశం ఉంది. ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అర్చక, ఉద్యోగులు కోరుతున్నారు. వెంకన్న గుడికి తాళం అర్చకుల సమ్మె ఎఫెక్ట్ 577 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ ఎదులాపురం(ఆదిలాబాద్): జీవో 577 ప్రకారం వేతనాలు చెల్లించాలని అర్చక, ఉద్యోగులు సమ్మె బాట పట్టగా అర్జిత సేవలు నిలిచిపోయి భక్తుల రాలేక ఆలయాలు వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రంలోని మర్వాడీ ధర్మశాల వేంకటేశ్వర ఆలయంలో అర్చక, ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఆదివారానికి మూడోరోజుకు చేరుకుంది. అర్చక, ఉద్యోగులు మాట్లాడుతూ తమకు జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. వారితో సమానంగా అన్ని అలవెన్సులను అందించాలన్నారు. సమ్మెలో అర్చక, ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లప్ప చంద్రశేఖర్, అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పనకంటి విలాస్శర్మ, అర్చకులు సునీల్‌కుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రభుత్వం ఏడాది క్రితం అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ట్రెజరీ ద్వారా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. – జగన్నాథస్వామి, దేవరకోట ఆలయ అర్చకుడు, నిర్మల్ సేవలు నిలిపివేశాం రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు ఆలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేశాం. కేవలం నిత్యపూజలు, మహానైవేద్యాన్ని సమర్పిస్తున్నాం. ఆలయాలను తెరిచే ఉంచి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం మా ఆవేదన అర్థం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలి. – నవీన్, దేవరకోట -
దక్షిణ సమర్పయామి..!
సాక్షి, హైదరాబాద్ : దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణను ఆసరాగా చేసుకుని దళారులు దండెత్తారు. క్లిష్టమైన ఆ అంశాన్ని కొలిక్కి తెస్తామని, సవరణ పరిధిలోకి రాని వారికి భవిష్యత్‌లో వేతన సవరణ జరిపిస్తామని భారీగా దండుకుంటున్నారు. డబ్బులిచ్చిన వారి జాబితానే సర్కారుకు చేరుతుం దని.. వారికి మాత్రమే వేతనాలు పెరుగుతాయని, క్రమబద్ధీకరణ జరుగుతుందని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో ఉద్యోగి, అర్చకుడి నుంచి రూ.10 వేల వరకు.. మొత్తంగా రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. దేవాలయ ఉద్యోగుల నుంచి ఓ గుంపు, అర్చకుల నుంచి మరో గుంపు ఈ వసూళ్ల వేటలో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. మెలికలను ఆసరాగా చేసుకుని.. అర్చకులు, దేవాలయ సిబ్బందికి దేవాలయాల ఆదాయం నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లిస్తూ వచ్చారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని అధికారులు వేధిస్తున్నారని.. ఆదాయం లేదంటూ, తగ్గిందంటూ సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా కోత పెడుతున్నారని ఆలయ ఉద్యోగులు, అర్చకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. సెక్షన్ 65ఏ ప్రకారం వేతన నిధి ఏర్పాటుచేసి ప్రభుత్వోద్యోగుల తరహాలో ఒకటో తేదీనే బ్యాంకు ఖాతాలకు వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రూ.50 వేలకు పైబడి ఆదాయం ఉన్న దేవాలయాలను వేతన సవరణ పరిధిలోకి తేవాలని నిర్ణయించగా.. ఆ లెక్కన ఉద్యోగులు, అర్చకుల సంఖ్య 6 వేల వరకు చేరింది. అయితే 2015 పీఆర్సీ, కన్సాలిడేటెడ్ పే, ఎన్ఎంఆర్.. ఇలా రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి ఆ సంఖ్యను సగానికి కంటే తక్కువ చేశారు. దీంతో అర్చకులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. దీన్ని అనుకూలంగా మలుచకున్న వసూళ్ల బృందాలు.. ఆయా ఉద్యోగులను వేతన సవరణ కిందకు తీసుకురావాలంటే సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలనూ సవరణ పరిధిలోకి తెస్తామంటూ రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వసూళ్ల రాయుళ్లకు టెన్షన్.. దేవాలయ ఉద్యోగులు, అర్చకుల నుంచి భారీగా దండుకున్న వసూళ్ల రాయుళ్లకు తాజాగా ఓ విషయంలో టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగుల నియామకంపై నిషేధం ఉన్నా.. దేవాదాయ శాఖలో 1,700 మంది అక్రమంగా చేరినట్లు అధికారులు ఇటీవల తేల్చారు. వారికి వేతన సవరణ సాధ్యం కాదని దేవాదాయ శాఖ కమిషనర్ తేల్చడంతో ప్రస్తుతానికి వారి విషయం గందరగోళంలో పడింది. ఆ ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినందున.. వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని సంబంధిత ముఠా వ్యక్తులు పట్టుపడుతున్నారు. దీంతో కమిషనర్‌ను కాదని రాజకీయ కోణం వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో వసూళ్ల అంశం వివాదాస్పదమై ప్రభుత్వానికే మచ్చతెచ్చేలా తయారైంది. మంత్రికి ఫిర్యాదు చేయండి.. వేతన సవరణ వసూళ్ల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా.. వేతన సవరణ అంశం వివాదాల చుట్టూ తిరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. వసూళ్లకు, తమకు సంబంధం లేనందున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
'అర్చకుల వేతనాలపై సీఎంతో చర్చిస్తా'
సాక్షి, హైదరాబాద్: అర్చకుల వేతనాల విషయంలో ముఖ్య మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అర్చక సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తెలంగాణ అర్చక సమాఖ్య ముద్రించిన కొత్త డైరీని మంగళవారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, దేవాలయ ఉద్యోగుల సంఘం నేత మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి’
ఖమ్మం: ట్రెజరీ(010) ద్వారా జీతాలు చెల్లించాలని కోరుతూ అర్చకులు హోమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అర్చకుల సమాఖ్య ఆధ్వర్యంలో వైరా రోడ్డులో పాత ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులంతా కలిసి శుక్రవారం ప్రత్యేక హోమం నిర్వహించారు. దేవాదయ శాఖ కలగజేసుకొని అర్చకుల డిమాండ్లను తీర్చాలని వారు కోరారు.