ఆలయాలకు మంచిరోజులు | AP Budget 2019 Endowment Department Allocations | Sakshi
Sakshi News home page

ఆలయాలకు మంచిరోజులు

Published Sat, Jul 13 2019 5:23 AM | Last Updated on Sat, Jul 13 2019 9:19 AM

AP Budget 2019 Endowment Department Allocations - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూప, దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనిరీతిలో మొట్టమొదటిసారిగా బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. వీటి నిర్వహణకు తగినన్ని నిధుల్లేని హిందూ దేవాలయాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో నిత్య పూజలు జరిపించేందుకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రూ.234కోట్లను కేటాయిస్తున్నట్లు తన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం ప్రకటించారు. ఇన్నాళ్లు దేవదాయ శాఖ అంటే.. రాష్ట్రంలోని ఆదాయం ఉండే ఆలయాల నుంచి ప్రతియేటా 21.5 శాతం మొత్తాన్ని ప్రభుత్వం పన్ను రూపంలో వసూలుచేసి, ఆ డబ్బులతోనే దేవదాయ శాఖ ఖర్చులకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఆ శాఖ అవసరాలకు ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి కేటాయింపులు అస్సలు జరిగేవి కావు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 19వేల ఆలయాలకు ఏడాదికి రూ.50వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి. ఫలితంగా వీటిల్లో నిత్యం ధూప, దీప, నైవేద్యాలు జరిగేవి కావు. కానీ, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్‌ఎస్‌) పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ధూప, దీప, నైవేద్యాలకు రూ.వెయ్యి, పూజారికి గౌరవ వేతనంగా రూ.1,500 చెల్లించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచారు. అయితే, ఈ మొత్తాన్ని ఆదాయం ఉన్న వివిధ ఆలయాల ద్వారా దేవదాయ శాఖకు పన్నుల రూపంలో వచ్చే మొత్తం నుంచి ఖర్చుపెట్టేవారు. కానీ, ఆ మహానేత హఠాన్మరణంతో ఈ పథకం కొడిగడుతూ వచ్చింది.

రాష్ట్ర విభజన సమయానికి రాష్ట్రంలో 1906 ఆలయాలకు డీడీఎన్‌ఎస్‌ పథకం అమలవుతుండగా.. ఈ ఏడాది జూన్‌ నెలకు ఆ సంఖ్య 1,604కు పడిపోయింది. అలాగే, చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఆలయాల నుంచి కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) పేరుతో వసూలు చేసిన డబ్బుల నుంచి కేవలం రూ.9.62 కోట్లను మాత్రమే డీడీఎన్‌ఎస్‌ పథకానికి ఖర్చు పెట్టింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో చిన్నచిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులు డీడీఎన్‌ఎస్‌ పథకం కింద అందే ఆర్థిక సహాయంతో పాటు గౌరవ వేతనాన్ని పెంచాలంటూ పెద్దఎత్తున వినతిపత్రాలు అందజేయడంతో ఆయన అప్పట్లో సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్‌లోనే దాని అమలుకు ఏకంగా రూ.234 కోట్లు కేటాయించారు.

చరిత్రలో మొదటిసారిగా..
బడ్జెట్‌లో ఆదాయంలేని ఆలయాల నిర్వహణకు చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ.234 కోట్ల మేర కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది.
– పద్మ, దేవదాయ శాఖ కమిషనర్‌

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు  రూ.100 కోట్లు

సాక్షి, అమరావతి: బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక కేటాయింపు ఇదే. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.500 కోట్ల ఏక మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని పట్టించుకోకపోగా.. గడిచిన ఐదేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.282 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సరాసరిన రూ.56 కోట్లు మాత్రమే కేటాయించిందన్నమాట. రాష్ట్రంలో 18 ఏళ్ల వయస్సు నిండిన బ్రాహ్మణుల సంఖ్యే 45 లక్షలదాకా ఉంటుందని అంచనా. అయితే కార్పొరేషన్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు మాత్రమే విడుదల చేయడంతో కేవలం 80 వేల మందికే సాయం చేయగలిగింది. అయితే ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణ వర్గానికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బడ్జెట్‌ కేటాయింపులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement