కావేరి నది ఉద్భవించిన తలకావేరీ ప్రాంతంలో తీర్థోర్భవానికి సన్నద్ధమవుతోంది. కావేరి మాత కొలువైన తలకావేరీ ప్రాంతంలో ఈనెల 17న జలరూపిణిగా కావేరి దర్శనమివ్వనున్నారు.
- ఈనెల 17న సాయంత్రం కావేరీ దర్శనం
- లక్షలాది మంది భక్తులు దర్శించుకునే అవకాశం
కావేరి నది ఉద్భవించిన తలకావేరీ ప్రాంతంలో తీర్థోర్భవానికి సన్నద్ధమవుతోంది. కావేరి మాత కొలువైన తలకావేరీ ప్రాంతంలో ఈనెల 17న జలరూపిణిగా కావేరి దర్శనమివ్వనున్నారు. రాష్ర్టంలోని వారితో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజలు కావేరి మాతను కులదేవిగా పూజించుకుంటున్నారు. అలాంటి లక్షలాది మంది ఈ తీర్థోర్భవానికి తరలిరానున్నారు.
- సాక్షి, బెంగళూరు
మౌలిక సదుపాయాల కల్పన కోసం..
తలకావేరి తీర్థోర్భవానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రజాపనుల శాఖ, దేవాదాయశాఖలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మడికేరి, భాగమండల, తలకావేరి, కరికె రహదారుల్లోని రోడ్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఆయా రహదారులకు మరమ్మతు పనులు చేపట్టడంలో నిమగ్నమయ్యాయి.
తీర్థోర్భవ సమయంలో బ్రహ్మకుండికెలో స్నానం చేసేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు కాబట్టి ఆ సమయంలో ఎలాంటి తోపులాట జరగకుండా ఉండేందుకు బ్యారికేడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. తీర్ధోర్భవ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు గాను దాదాపు లక్షకుపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తలకావేరి-భగండేశ్వర దేవాలయ సమితి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల జోరు....
తీర్థోర్భవ ఘట్టానికి గాను తలకావేరి ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. లక్షల రూపాయలను వెచ్చించి క్షేత్రాన్ని పుష్ఫాలతో అలంకరించనున్నారు. ఇక రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.